– కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనలపై పౌరుని చేతిలో సీవిజిల్ యాప్ ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సి.విజిల్ యాప్ కు సంబంధించిన ఫ్లెక్సీని జిల్లా యస్.పి రాహుల్ హెగ్డే తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మస్త్రంగా మారిందన్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్‌తో అనుసంధానం చేశారని అన్నారు. అక్రమాలకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలోనే దర్యాప్తు చేసి ఫిర్యాదుదారుడికి తెలియజేస్తుందన్నారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్కాడ్‌కు సత్వరమే చేరుతుందని తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు, నాయకుల అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై సామాన్య పౌరులు సైతం నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇప్పటివరకు 60 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్లే స్టోర్‌కు వెళ్లి సీ-విజిల్ యాప్ అని టైప్ చేయగా.. 8.41 ఎంబీ ఉన్న యాప్ డౌన్‌లోడ్ అవుతుందని అన్నారు. వినియోగదారుడు తన ప్రాంతంలో జరిగిన కోడ్ ఉల్లంఘనలపై ఫొటో లేదా వీడియో, ఆడియో రూపంలో లోగోను బట్టి ఎంచుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి చేరుతుందని వారు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందుతుందని తెలిపారు. ఈ యాప్‌లో ఎన్నికల సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న కోడ్ ఉల్లంఘనలు పొందుపరుచవచ్చునని , ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకుంటారని యస్.పి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ వీర బ్రహ్మాచారి, డీఎస్పీ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, డీఈఓ ఆశోక్ ,తహసీల్దార్ శ్యాం సుందర్ రెడ్డి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.