నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యాకు చెందిన ‘అంటోనోవ్ ఏఎన్-12’ సైనిక రవాణా విమానం మంగళవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 17 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. యగునోవో గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రష్యన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
కెమెరోవో ప్రాంత గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ ఈ విమాన ప్రమాదాన్ని ధ్రువీకరించారు. విమానం నొవొసిబిర్స్క్ నుంచి క్రాస్నోయార్స్క్‌లోని కాన్స్క్‌కు విడి భాగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి ముందు విమాన సిబ్బంది డిస్ట్రెస్ సిగ్నల్ పంపించి, అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
విమానం నేలకూలడానికి ముందే గాలిలో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంజిన్లలో ఒకదానిలో ఇంధనం లీక్ కావడం వల్లే మంటలు అంటుకొని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. హైడ్రాలిక్ వైఫల్యం వంటి ఇతర సాంకేతిక లోపాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విమానం జనావాసాలపై పడకుండా ఉండేందుకు సిబ్బంది చివరి క్షణం వరకు ప్రయత్నించినట్లు సమాచారం.
అంటోనోవ్ ఏఎన్-12 విమానాలు 1950వ దశకంలో సోవియట్ యూనియన్ రూపొందించిన నాలుగు ఇంజిన్ల టర్బోప్రాప్ రవాణా విమానాలు. వీటిని ప్రధానంగా సైనిక, సరుకు రవాణా అవసరాల కోసం వినియోగిస్తుంటారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఘోర విమాన ప్రమాదం..17 మంది మృతి
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)