నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.
పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్స్ వద్ద విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌కు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
నిమజ్జనానికి వచ్చే విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు. పాత పోలీస్ స్టేషన్ సైఫాబాద్ వద్ద వాహనాలను రవీంద్ర భారతి, మాసాబ్‌ట్యాంక్ వైపు మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
నిమజ్జన కార్యక్రమాలకు వచ్చే భక్తులు, నగర ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటించాలని కోరుతున్నారు. నిమజ్జన ప్రాంతాల పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు సహకరించి ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పడాలని అధికారులు సూచిస్తున్నారు.







కామెంట్‌లు (0)