నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా తమ షరతులను అంగీకరిస్తే, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి రెండు రోజుల ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ సోమవారం తెలిపారు. ఇరాన్ షరతులను అమెరికా అంగీకరించడంపైనే ఈ ప్రణాళిక " ఆధారపడి" ఉందని, ఆ తర్వాతే తదుపరి దశల గురించి చర్చించగలమని అన్నారు.
ఇరాన్ షరతులను అంగీకరిస్తే, హార్ముజ్ జలసంధి వద్ద భద్రతను పునరుద్ధరించడం, త్వరలోనే చర్చలను తిరిగి ప్రారంభించడం సాధ్యమవుతుందని తాము భావిస్తున్నామని బఖాయీ స్థానిక మీడియాకు వెల్లడించారు. మధ్యవర్తుల ద్వారా అమెరికాతో సందేశాల మార్పిడి కొనసాగుతోందని ఇరానియన్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా కోసం ఇరాన్, ఒమన్ మధ్య అంగీకరించిన కొత్త మార్గాన్ని అమెరికా తప్పక అంగీకరించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు. ఇటీవల విధించిన ఆంక్షలను కూడా అమెరికా తొలగించి, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనిక బలగాల సంఖ్యను తగ్గించాలని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి ముగింపు పలకడం, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురు రంగంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడం, అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం వంటివి ఇరాన్ ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.







కామెంట్‌లు (0)