– ఫూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలనడం మరీ విడ్డూరం
– 10 ఏండ్లు అధికారంలో ఉన్నపుడు యాదికి లేడా?
– ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలను వంచించిన బీఆర్‌ఎస్ ఇప్పుడు బీసీల సంక్షేమం గురించి మాట్లాడ్డం వింతగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాత్మాజోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని ఆ పార్టీ కోరడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నపుడు ఆ మహనీయుడు యాదికి లేదా?అని ఎక్స్ వేదికగా సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. ఆయన్ను గుర్తు చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనమని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఫూలే సలిపిన పోరాటమే తమ ప్రభుత్వానికి ఆదర్శమని స్పష్టం చేశారు. అందుకే ఫూలే ప్రజాభవన్ అని పెట్టుకున్నామనీ, ప్రజాపాలన అందిస్తున్నామని వివరించారు. ఆయన తమకు సర్వదా స్మరణీయుడని అన్నారు. నియంతృత్వానికి ఎదురుతిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మెన్‌ను ఏడిపించింది కవిత కాదా?అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉండి ఉద్యమకారుడిగానే అణగారిన వర్గాలకు ఆప్తున్ని అని పొన్నం అన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడతానని చెప్పారు. బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నాయకుడిని బీసీలకు ఇవ్వగలరా?అని నిలదీశారు. గత ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్, మండలి చైర్మెన్ పదవులను బీసీలకు ఎందుకివ్వలేదని అడిగారు.