నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో మహమ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని దుండగుడు ఫైజ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ సాయంతో కీలక ఆధారాలను సేకరించారు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.



