నవతెలంగాణ-పెనుబల్లి/విలేకరులు
రాష్ట్రంలోని 19 నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. ప్రజలను కలుస్తూ సమస్యలను వింటూ .. పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గురువారం ఇంటింటి ప్రచారాలతో పాటు ర్యాలీలు కూడా చేపట్టారు. కాలనీవాసులతో మీటింగ్లు పెట్టి .. కమ్యూనిస్టుల గెలుపు అవసరాన్ని వివరిస్తున్నారు. పదవుల కోసం సీపీఐ(ఎం) ఆరాటపడదని, పేద ప్రజల సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యమని ఆ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి మాచర్ల భారతి అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి మాచర్ల భారతి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పదవుల కోసం, అధికారం కోసం అర్రులు చాస్తూ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నాయన్నారు. అవినీతి సొమ్ముతో మాయమాటలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ఓట్లు దండుకొని అధికారం చేజిక్కించుకున్నాక ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.