కూర్పు కుదిరేనా?

కూర్పు కుదిరేనా?– బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూర్పుపై ఆసక్తి
– జైస్వాల్‌, దూబెలలో ఒకరికే అవకాశం!
– రేపు ఐర్లాండ్‌తో భారత్‌ తొలి పోరు
2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియా.. పొట్టి ఫార్మాట్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. భారత్‌ 2007 టీ20 వరల్డ్‌కప్‌ సాధించటంతో.. ఆ మరుసటి ఏడాది నుంచే బీసీసీఐ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు శ్రీకారం చుట్టింది. 20 ఓవర్ల ఆటలో భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీసీసీఐ దోహదం చేసింది. కానీ 2007 తర్వాత టీమ్‌ ఇండియా మరోసారి పొట్టి ప్రపంచకప్‌ అందుకోలేక పోయింది. 2014 ఫైనల్లో, 2016 సెమీఫైనల్లో, 2022 సెమీఫైనల్లో భారత్‌ నిరాశపరిచింది. 2024లో టీమ్‌ ఇండియా మరోసారి పొట్టి కప్పు వేటకు సిద్ధమైంది. పొట్టి కప్పు కల సాకారం కావాలంటే.. తొలుత తుది జట్టు కూర్పు కుదరాలి!!.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021, 2022 ఎడిషన్లలో టీమ్‌ ఇండియా విఫలమైంది. 2021లో ఏకంగా గ్రూప్‌ దశలో నిష్క్రమించగా.. 2022లో సెమీఫైనల్స్‌లో పరాజయం చవిచూసింది. 2024 టీ20 ప్రపంచకప్‌ సవాల్‌కు టీమ్‌ ఇండియా అంత గొప్పగా సన్నద్ధమైనట్టు అనిపించదు. గత ప్రపంచకప్‌లో ఆడిన జట్టు, వ్యూహంతోనే మళ్లీ ఇప్పుడూ ఆడేందుకు సిద్ధమైన టీమ్‌ ఇండియా… ఫలితం మాత్రం భిన్నంగా ఉండాలని కోరుకుంటుంది. 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో ఆడిన భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడుగురులో కనీసం ఐదుగురు ఇప్పుడున్న జట్టులోనూ ఉన్నారు. గాయంతో రవీంద్ర జడేజా దూరమైనా.. అక్షర్‌ పటేల్‌ ఆటతీరు జడేజా శైలి దాదాపుగా ఒకటే. 2024 టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు టీమ్‌ ఇండియా గత ఏడాదిన్నరగా వ్యూహాత్మంగా పెద్దగా శ్రమ పడినట్టు కనిపించదు. ఇతర జట్లు పొట్టి ఫార్మాట్‌లో వేగంగా మ్యాచ్‌ను గతిని మార్చగల కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తుండగా.. భారత జట్టులో మాత్రం స్టార్‌డమ్‌ మేనియా నడుస్తోంది. అగ్ర క్రికెటర్లకే జట్టులో అగ్ర తాంబూలం అందించే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. సెలక్షన్‌ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌, కోచ్‌.. ఇలా అందరూ ప్రపంచకప్‌ ముంగిట నిద్ర లేచారు!.ఓ మూడు నెలల ముందు వరకు ప్రపంచకప్‌లో కెప్టెన్‌ ఎవరనే అంశం సైతం ఎవరికీ తెలియదు. ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను గతంలో ప్రయత్నించిన వారే మరోసారి ఇప్పుడూ వేటాడుతున్నారు.
కూర్పు కీలకం : భారత క్రికెట్‌ సంస్థాగతంగా ఓ సమస్యను ఎదుర్కొంటుంది. స్టార్‌డమ్‌ ఎక్కువగా పెద్దపీట వేయటం భారత క్రికెట్‌కు చేటు చేస్తోంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ జట్టులో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో జట్టుకు ఎంత లాభమో, అంతే నష్టం కూడా!. వన్డే ఫార్మాట్‌లో కోహ్లి, రోహిత్‌ విలువ వెలకట్టలేనిది. కానీ టీ20ల్లో మాత్రం వెటరన్‌ స్టార్స్‌ కాస్త వెనుకబడ్డారు. సంప్రదాయ బ్యాటింగ్‌ శైలి కారణంగానే 2016 సెమీఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో దెబ్బతిన్న విషయం ఇక్కడ మరిచిపోకూడదు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, యశస్వి జైస్వాల్‌ రూపంలో ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. విరాట్‌ కోహ్లి ఇటీవల ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు. 741 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. రోహిత్‌ శర్మ ఎటాకింగ్‌ శైలి, అనుభవం తీసి పారేయలేం. రోహిత్‌, కోహ్లి ఓపెనర్లు వచ్చినప్పుడు.. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లను ఎదుర్కొవటం తలనొప్పి కానుంది. ఇటీవల కోహ్లి కాస్త మెరుగైనా.. లెఫ్టార్మ్‌ పేసర్లపై ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు. నాకౌట్‌ మ్యాచుల్లో అగ్ర జట్లు ఈ బలహీనతపై ఫోకస్‌ చేసేందుకు అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకొస్తే.. రోహిత్‌ కుదురుకునేందుకు సమయం తీసుకోవచ్చు. జైస్వాల్‌ పవర్‌ప్లేతో ఎదురుదాడి చేస్తే.. ఆ తర్వాత రోహిత్‌ శర్మ మొదలుపెట్టవచ్చు. కానీ నం.3 బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి లేదా సూర్యకుమార్‌ యాదవ్‌ అనే అంశం మరో సమస్య. సూర్యకుమార్‌ యాదవ్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే రిషబ్‌ పంత్‌ మరో స్థానం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. రోహిత్‌, కోహ్లిలలో ఎవరో ఒకరు కనీసం పది ఓవర్ల పాటు క్రీజులో ఉండగలరు. దీంతో మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ డెత్‌ ఓవర్లలో ఊచకోతకు అనువైన వాతావరణం ఏర్పడనుంది. రవీంద్ర జడేజా, శివం దూబె సైతం రేసులోనే నిలిచారు.
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తుది జట్టులో ఖాయం. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఫామ్‌తో సంబంధం లేకుండా టీ20 జట్టులో చేర్చవచ్చు. గ్రూప్‌ దశలో విఫలమైనా… నాకౌట్‌లో సూర్య ప్రభావం ఊహించని స్థాయిలో ఉంటుంది. ఓ వికెట్‌ కీపర్‌, ఇద్దరు ఆల్‌రౌండర్లు అవసరం. ఇక్కడితోనే ఆరు బెర్త్‌లు అయ్యాయి. బౌలింగ్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ రాక టీమ్‌ ఇండియాకు గొప్ప బలం. పేస్‌తో బుమ్రా, స్పిన్‌తో కుల్దీప్‌ ఏం చేయగలరో ప్రత్యర్థులకు బాగా తెలుసు. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే. ఐదో బౌలర్‌ కోటా ఓవర్లను ఇద్దరు ఆల్‌రౌండర్లు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దూబె, జైస్వాల్‌ ఇద్దరినీ తుది జట్టులో చేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం నలుగురు బౌలర్లతో బరిలోకి దిగే సాహసం ఏ జట్టూ చేయబోదు. దీంతో జైస్వాల్‌, శివం దూబెలలో ఎవరో ఒకరే తుది జట్టులో నిలవాల్సి ఉంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌ లైనప్‌ టాప్‌-6. ఏడో బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్‌, శివం దూబెలలో ఎవరో ఒకరికి అవకాశం ఉంది. గత ప్రపంచకప్‌తో పోల్చితే ఈ సారి యశస్వి జైస్వాల్‌, శివం దూబె మాత్రమే కొత్త. వాస్తవికంగా చూస్తే.. పొట్టి ఫార్మాట్‌లో యశస్వి జైస్వాల్‌, శివం దూబెలకు కచ్చితంగా చోటు ఇవ్వాలి. పరిస్థితులకు తగినట్టు తుది జట్టు కూర్పు ఎంచుకుంటే గతం కంటే భిన్నమైన ఫలితం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంప్రదాయ పద్దతిలోనే సాగుతామంటే గతంలో మాదిరిగానే ఇంటిబాట పట్టేందుకు పెద్దగా సమయం పట్టదు!.

Spread the love