‘గృహహింస’ ఆగేదెన్నడో!?’

'Domestic violence' will stop!?'దేశవ్యాప్తంగా నవంబర్‌ 3వ తేదీన ‘జాతీయ గృహిణిల దినోత్సవం’ జరుపుతూ వివిధ కార్యక్రమాలు చేపడతూ, అభినందనలు తెలుపుతూ ఉంటారు. కానీ నేటికీ దేశంలో 81.2 శాతం మహిళలు వెట్టిచాకిరి వలలో జీవితాలు గడపడం గమనార్హం. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే పేరుతో మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ వంటింటికే తన జీవితం అంతా అంకితం చేస్తున్నారు. ఎన్ని సామర్థ్యాలు ఉన్నా మహిళల ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు మన దేశంలో ఉన్న పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నిర్మించ బడింది. దానికి పాలకులు ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. అనేక సామాజిక పోరాటాల ద్వారా ముఖ్యంగా సావిత్రి బారు ఫూలే, జ్యోతిరావు ఫూలే, రఘుపతి వెంకట రత్నం నాయుడు, గురజాడ, వీరేశలింగం, అంబేద్కర్‌ వంటి ఎందరో సంఘసంస్కర్తలు కృషి ఫలితంగా దేశంలో మహిళలకు చదువు, ఉద్యోగం, హక్కులు, చట్టాలు వచ్చాయి. అంతేకాకుండా వరకట్న నిషేధ చట్టం, నిర్భయ చట్టం, దిశా, 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం తీసు కొచ్చారు. అయినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా మహిళల పట్ల వివక్షత, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో చాలా కుటుంబాల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, హింసలు వెలుగు చూడని కోకొల్లలు. ముఖ్యంగా వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలెందరో? ఆ తల్లిదండ్రులు కడుపుకోత తీరేదెన్నెడు? అనాథలుగా మిగులు తున్న వారి పిల్లలకు రక్షణ ఎవరు !? అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది.
ఇక పిల్లలను కని, పెంచి పెద్ద చేసిన మాతృమూర్తిగా, తల్లిదండ్రులు (లేదా) పెద్దవారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన (లేదా) తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకుని ప్రతీక్షణం తన జీవితాన్ని తన కుటుంబం కోసం తాను వెలుగుతూ, కరగుతూ తన జీవితాన్ని అర్పించే గృహిణిల త్యాగం కొలవగలమా…!? వెలకట్టలేని ఆ జీవితాలను మానవతా వాదులుగా మనమే (మగవారం) మనలో సగభాగంగా అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి. గృహిణిలు అంటే వంటింటికే పరిమితం అనే భావన నుంచి బయటపడాలి. వారి శ్రమలో భాగస్వాములు కావాలి. కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉండాలి. సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలి. మత, కుల, లింగ ఆధారంగా అణిచి వేయరాదు. ముఖ్యంగా మహిళల చదువులకు పెద్దపీట వేయాలి. మహిళల ఆరోగ్యానికి కుటుంబ సభ్యులు. ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే మహిళల్లో ముఖ్యంగా గృహిణిల్లో చాలామంది పోషకాహారం లోపం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య సర్వే పేర్కొంటుంది. కరోనా కాలంలో ఎక్కువగా వీరికే నష్టం వాటిల్లింది. ఇంటిలో తల్లిదండ్రులు, అత్తమామలు,భర్త, పిల్లల పోషణలోనే గృహిణిల జీవితం గడిచిపోతుంది. దీంతో వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. చదువుకుని, ఉద్యోగం చేస్తున్న గృహిణిల జీవితాల్లో కూడా అణచివేత, హింసా జరుగుతూనే ఉంది. మహిళలు, గృహిణిలకు ఆర్థిక స్తోమత, స్వాతంత్య్రం కంటే సామాజిక న్యాయం కావాలి. మగవారితో సమానంగా మహిళలకు స్థానం కల్పించాలి. ప్రస్తుతం వచ్చిన చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ చట్టం తక్షణమే అమలు చేయాలి. అంతేకానీ 2029 నుంచి అమలు చేస్తాం అనే భావన వెనుక ఉన్న అణిచివేసే గుణాన్నిప్రశ్నించాలి? ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, క్రీడల్లో మహిళలు రాణించారు. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రతీ ఇంటిలో మహిళగా, గృహిణిగా అనేక సేవలందిస్తున్న మహిళల శ్రమను ఇకనైనా గుర్తించాలి. గౌరవించాలి. మహిళలు, బాలికలు, గృహిణిలపై జరుగుతున్న దాడులు, అణిచివేతలు, హింసపై మనమందరం గళమెత్తాలి. మహిళా సాధికారత దిశగా ప్రయాణం చేయాలి. చట్టాలు చేయడమే కాదు వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత పాలకులదేనని మరవరాదు. ముఖ్యంగా మహిళా చట్టాలపై గృహిణిలకు, బాలికలకు అవగాహన కల్పించాలి. వారి భద్రతకు, అభివృద్ధి కోసం పురుషులు, ప్రభు త్వాలు, మీడియా, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహ కరించుటయే ఈ దినోత్సవ ప్రాధాన్యత అని గ్రహించాలి.. అంతేకానీ, మొక్కుబడిగా సంబరాలు, సత్కారాలు చేసి చేతులు దులుపుకోరాదు.
– ప్రసాదరావు, సెల్‌: 6305682733

Spread the love