అభ్యర్థులు రె’ఢీ’

– ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోటీ
– భువనగిరిలో చతుర్ముఖ పోటీ
– నల్గొండలో త్రిముఖ పోటీ
– అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రుల పైనే
– బీ.ఆర్.యస్ కు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి
– ప్రచారానికి సిద్ధపడుతున్న పార్టీలు
నవతెలంగాణ – సూర్యాపేట
ఉమ్మడి నల్గొండ జిల్లాలో  అసలైన సార్వత్రిక  సమరం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో గెలుపు కోసం వ్యూహ, ప్రతి వ్యూహాలకు నాయకులు పదును పెడుతున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యవహరిస్తుండడంతో ప్రచార హోరు షురూ కానున్నది. గతంలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. కాగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ రెండు స్థానాల్లో గెలుపు తమదే అనే దీమాలో వున్నారు. ఈ క్రమంలో పరిశీలిస్తే…నల్గొండ పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా కుందూరు రఘువీర్ రెడ్డి,బి.ఆర్.యస్ నుంచి కంచర్ల కృష్ణా రెడ్డి, బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి లు పోటీలో వున్నారు. ఇక భువనగిరి స్తానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా చామల కిరణ్ కుమార్ రెడ్డి, బి.ఆర్.యస్ నుండి క్యామ మల్లేష్, సిపిఐఎం నుండి జహంగీర్, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ లు బరిలో ఉన్న విషయం తెల్సిందే.ప్రధానంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ ,భువనగిరి లోక్ సభ  స్థానాలలో విజయం సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకుగాను ఎన్నికల ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిసింది. ఈ వ్యూహం లో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, భవనగిరి లోక్ సభ స్థానాలలో ఘన విజయం నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను నల్గొండ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, భువనగిరి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి లను భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సత్తాని మరోసారి ప్రతిపక్షాలకు చూపెట్టాలనే కసితో మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా  ప్రభుత్వం ప్రజలకు అందజెస్తున్న గ్యారెంటీ పథకాలతో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ తన తండ్రి మాజీమంత్రి జానారెడ్డి బ్రాండ్ ను ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరుగాంచిన భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ సుపరిచుతుడే అయినప్పటికీ ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు మాత్రం ఆయనకు తప్పనిసరిగా కావల్సి ఉంటుంది. ఇకపోతే కకలావికమైన బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి నానా తంటాలు పడిన విషయం తెల్సిందే. ప్రధానంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణ రెడ్డి ని అభ్యర్ధి గా నల్గొండ స్థానానికి పోటీలో పెట్టగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో మెజారిటీ నియోజకవర్గాలకు చెందని క్యామ మల్లేష్ ని అభ్యర్థి గా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రజలకు వీరిద్దరూ కూడా కొత్త మొఖాలు కావడం గమనార్హం.నల్గొండ పరిధిలో హేమహేమీలైన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్,తెర చినపురెడ్డి తదితరులు ఉన్నప్పటికీ వారిని కాదని కృష్ణా రెడ్డి కి టిక్కెట్ ఇవ్వడం తెలిసిందే. బిజెపి అభ్యర్థి గా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక భువనగిరి లో కూడా జిట్టా బాలక్రిష్ణ రెడ్డి, బూడిద బిక్షమయ్యా గౌడ్,చెరుకు సుధాకర్ తదితరులను పక్కన పెట్టి మెజారిటీ నియోజకవర్గాలకు పరిచయం లేని ఇబ్రహీంపట్నం కు చెందిన క్యామ మల్లేష్ కు కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు.మరి వీరి గెలుపు బాధ్యతను మాజీమంత్రి జగదీష్ రెడ్డి తో పాటు ఆయా పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలకే అప్పగించినట్లు తెలుస్తుంది.వీరు ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో నీళ్ళు లేక బీడు భూములు గా మారుతున్న పొలాలను అస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారానికి సిద్ద పడుతున్నారు. ఇదిలావుండగా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట గా ఉన్న భువనగిరి పార్లమెంట్ పరిధిలో  సిపిఐఎం అభ్యర్థి గా జహంగీర్ పోటీలో వున్నారు.ఇప్పటికే అధినాయకత్వం పలు మార్లు సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుతూ సిపిఐఎం ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇకపోతే బిజెపి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు.ఇక రెండు పార్లమెంట్ పరిధిలో పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు ఎన్నికల కదన రంగానికి సిద్ద పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు ఎంపీ స్థానాలలో  నల్గొండ యంపీ స్తానం సూర్యాపేట జిల్లాలోని సుర్యాపేట, కోదాడ, హుజూర్నగర్  నియోజకవర్గాలు ఉండగా నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ,  నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా సూర్యాపేట లో జగదీష్ రెడ్డి తప్పితే బి.ఆర్.యస్ పార్టీ  మిగిలిన  నియోజకవర్గాలలో ఓటమి చెందిన విషయం తెలిసిందే.భువనగిరి పార్లమెంట్ పరిధిలో భువనగిరి, మునుగోడు, ఆలేరు,నకిరేకల్,తుంగతుర్తి,జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మెజారిటీ నియోజకవర్గాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లే ఉన్నారు. ఈ క్రమంలో దాదాపుగా ప్రధాన పార్టీలు కొత్తవారినే అభ్యర్థులు గా ఎన్నికలో నిలిపింది. వారు చేస్తున్న ప్రయోగం సఫలం అయితదా, విఫలమవుతుందా తేలాల్సి ఉంది.  ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వీరి మధ్య  ఎన్నికల పోరు ప్రారంభం కానున్నది. ప్రధానంగా నల్గొండ,భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్, బి.ఆర్.యస్,సిపిఐఎం,బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉన్నది.నాలుగు పార్టీలు కూడా గెలును  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరి పోరు తప్పేటట్లు లేదు.
Spread the love