ఆధునిక నవబౌద్ధుడిగా, విజ్ఞాన వేత్తగా, విశేషజ్ఞాన సంపన్నుడిగా, తిరుగులేని కుల నిర్మూలనవాదిగా, సంఘ సంస్కరణోద్యమకారుడిగా పోకల లక్ష్మీ నరసు (1861-1934) అందించిన సేవలు చిరస్మరణీయ మైనవి. దక్షిణ భారత బౌద్ధ సంఘాలకి జీవిత కాలం ఆయనే అధ్యక్షుడు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు సింగరవేల్ చెట్టియార్‌తో కలిసి ‘మహాబోధి సొసయిటీ’ స్థాపించిన బౌద్ధ ప్రచారకులు. నిబద్దతతో కృషి చేసే ప్రతి కులనిర్మూలన వాది, సామాజిక కార్యకర్త, తప్పకుండా ప్రొ.పోకల లక్ష్మీ నరసు రచనలు అధ్యయనం చేయాలి. సమతా వ్యవస్థ కోసం తపించిన అద్వితీయ ప్రతిభాశాలి, మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం! తమిళకవి సుబ్ర హ్మణ్య భారతికి ఈయన ఒక నాస్తిక మిత్రుడు. జాతీయోద్యమ నాయకుడైన డా.భోగరాజు పట్టాభి సీతా రామయ్యకు ఆప్త మిత్రుడు. ఆధ్యాత్మిక రారాజుగా వెలు గొందిన స్వామి వివేకానందను ముఖాముఖి ఎదుర్కొన్న తెలుగువాడు. మన ఈ పోకల లక్ష్మీ నరసు! 1906లోనే ఈయన తొలి వర్ణాంతర విందు ఏర్పాటు చేశారంటే, దేశంలో మానవవాద దృక్పథం వేళ్ళూనుకోవడానికి, మనువాదాన్ని మట్టి కరిపించడానికి ఆయన గట్టి ప్రయ త్నమే చేశారని తెలుస్తోంది. ఈయన జీవిత విశేషాలు పరిశోధించి రవిచంద్ 2004లో ”ఆంధ్ర బౌద్ధ భాష్య కారుడు ప్రొఫెసర్ పి.లక్ష్మీనరసు” అనే వివరణాత్మకమైన రచన ప్రకటించారు.
కుల వ్యవస్థలోని కష్టనష్టాలను గుర్తించిన తొలితరం మహనీయులలో ప్రొ.పి.లక్ష్మీ నరసు ఒకరు. ఈయన రచనTHE ESSENCE OF BUDDISM కి డా.బి.ఆర్. అంబేద్కర్ ముందుమాట రాశారు. వీరి ఇతర ముఖ్యమైన రచనలు 1. WHAT IS BUDDISM 2. A STUDY OF CASTE 3. THE RELIGION OF MODERN BUDDHIST వగైరా ఇవి అందరూ చదవవల్సిన పుస్తకాలు. కొన్ని నెట్‌లో కూడా దొరకొచ్చు.
శరీరాన్ని మించిన క్షేత్రం లేదు.
మనసును మించిన తీర్థం లేదు.
జీవితాన్ని మించిన గ్రంథం లేదు.
అంతరాత్మను మించిన గురువు లేడు.
అనుభవాన్ని మించిన పాఠం లేదు. – బుద్ధుడు.
ఇంగ్లీషులో వెలువడ్డ ప్రొఫెసర్.పి.ఎల్. నరసు రచనలన్నీ ఢిల్లీలోని సమ్యక్ ప్రకాశన్ వారి దగ్గర ఉన్నాయి.THE ESSENCE OF BUDDISM ను తైవాన్ బౌద్ధ సంఘం లక్షల ప్రతులు ప్రచురించి, ప్రపంచ వ్యాప్తంగా దేశదేశాల జ్ఞాన పిపాసులకు ఉచితంగా అందించింది. దీన్ని చంద్రశేఖర్ ‘బౌద్ధ ధమ్మసారం’ పేరుతో తెలుగు చేశారు, ఇక ప్రొ.నరసు రచన A STUDY
OF CASTE అంబేద్కర్ రచన కుల నిర్మూలన ANNIHILATION OF CASTE పై ప్రభావం చూపిందని అంటారు. అయితే RELIGION OF MODERN BUDDHIST ఇంత వరకు తెలుగులోకి రాలేదు. ఎవరైనా ఆ పనికి పూనుకుంటే బావుంటుంది. మరో రచనను WHAT IS BUDDHISMను జెకోస్లోవేకియా తొలి రాష్ట్రపతి, థామస్ మాసరిక్ జెక్ భాషలోకి అనువదించారు. తర్వాత అది జర్మన్ భాషలోకి కూడా అనువాద మయ్యింది. అదే గ్రంథాన్ని ఏటుకూరి బల రామమూర్తి తెలుగు చేశారు. దానికి కళాతాత్త్వికులు సంజీవదేవ్ ముందుమాట రాశారు. అది మిళింద ప్రచురణగా బయటకు వచ్చింది.
‘ద ఎస్సెన్స్ ఆఫ్ బుద్ధిజం’కు డా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన ముందుమాటతో మనకు ప్రొఫెసర్ లక్ష్మీ నరసుకు సంబంధించిన అనేక విషయాలు అవగతమౌతాయి. నిజానికి వీరిద్దరూ కలుసుకోలేదు, కానీ, వీరిద్దరికీ అత్యంత సన్నిహితుడైన డా.భో.పట్టాభి సీతారామయ్య మూలంగా అంబేద్కర్, ప్రొ. నరసు వ్యక్తిగత విషయాలు. జీవిత విశేషాలు తెలుసుకోగలిగారు. THE ESSENCE OF BUDDHISMఅనే ఇంగ్లీషు పుస్తకం మొదట 1907లో అచ్చయ్యింది. అప్పటికి అంబేద్కర్, సుమారు పదహారేళ్ళ వాడు. ఈ విషయం ఎందుకంటే, వాళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం తెలుసుకొవడానికి! ప్రొ. నరసు ఆ పుస్తకం ప్రకటించే నాటికి సుమారు నలభై ఆరేళ్ళవాడు. ఇక ఆ పుస్తకం రెండో ముద్రణ 1912లో వెలువడింది. ఆ తర్వాత, చాలా కాలం వరకు(out of print)అది ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ పుస్తకం చదివి, ఆనందించి అలాంటి పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉండడం చాలా అవసరమని డా. అంబేద్కర్ స్వయంగా పూనుకున్నారు. బొంబాయిలో 1948లో థక్కర్‌ప్రెస్‌లో మూడో ముద్రణ అచ్చే యించారు. కుల నిర్మూలను కట్టుబడి అహోరాత్రులు పనిచేసిన కార్యకర్తగా, నవబౌద్ధుడిగా తను మారడమే కాకుండా, బౌద్ధ కార్యకర్తగా దక్షిణ భారతదేశంలో విశేషంగా కృషిచేసిన వాడిగా ప్రొ.లక్ష్మీ నరసు అంబేద్కర్‌కు బాగా నచ్చారు. అందుకే ముందుమాట రాసి, మూడవ ముద్రణ వేయించే బాధ్యత తనకు తానై స్వీకరించారు. అప్పటికి అంబేద్కర్ వయసు యాభై ఏడు! ప్రొ. లక్ష్మీ నరసు కన్నుమూసి పద్నాలుగేళ్ళు !!
ప్రొఫెసర్ లక్ష్మీ నరసు మొదట మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ట్యూటర్. డిమాన్‌స్ట్రేటర్‌గా కొంతకాలం పని చేసారు. ఆ తర్వాత 1897లో భౌతికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 1898 – 99లలో అప్పటి హెడ్ మఫెట్ అనే బ్రిటీష్ ప్రొఫెసర్ సెలవుపై వెళ్ళగా ఆ బాధ్యతలు నరసు నిర్వహించారు. భౌతిక, రసాయనిక డిగ్రీ క్లాసులన్నీ ఈయన ఆధ్వ ర్యంలోనే నడిచేవి. ఈయన మేధో సంపత్తి ఎంతటిదంటే – అకాడమిక్‌గా అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, అన్ని విషయాలకు వివరణలు ఇస్తూ ఆనాటి బ్రిటిష్ ప్రొఫెసర్ల అహంకారాన్ని అణిచి వేస్తుండేవారు. దేశం బ్రిటీష్ పాలనలో ఉన్న రోజులు గనక, తాము పాలకులమని, ఇక్కడి భారతీయులు పాలితులనీ – ఓ చిన్నచూపు ఉండేది. తాము బ్రిటన్‌లో ఉన్నత చదువులు చదివి వచ్చిన వారమని – ఇక్కడి వారికి తమకు ఉన్నంత తెలివి, విజ్ఞత ఉండవని ఒక అభిప్రాయం ఉండేది.
కానీ, ప్రొ. లక్ష్మీ నరసు తన అద్వితీయమైన మేధో సంపత్తితో వారి అహాన్ని అణిచివేస్తుండేవారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రొఫెసర్ విల్సన్ డైనమిక్స్‌లో పెద్ద ఉద్దండుడని ఒక అభిప్రాయం ఉండేది. ఒకసారి ప్రొఫెసర్ లక్ష్మీ నరసు ఆయనకే కొన్ని విషయాలు వివరించాల్సి వచ్చింది. విపులంగా వివరించి, చివరగా ఓ మాట అన్నారు – ”ప్రొఫెసర్ విల్సన్‌కు డైనమిక్స్ చెప్పగలిగినందుకు నా కెంతో ఆనందంగా ఉంది” – అని! భారతీయుడిగా ఆయన తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిం చారు. తన దేశ ఔన్నత్యం చాటి చెప్పుకోవడంలో ఎక్కడా ఏ మాత్రం తగ్గలేదు. ఆయన కాలంలో పాలిస్తున్న బ్రిటిష్ పాలకుల్ని, అంతకు ముందు పాలించిన మొఘలుల్ని, ఇంకా ముందు పాలించిన డిల్లీ సల్తనేట్‌ను అందరినీ వదిలేసి – భారతదేశ చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్ళి, అశోక చక్రవర్తితో ప్రభావితుడయ్యారు. అశోకుణ్ణి ప్రభావితం చేసిన శాక్యముని బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడయ్యారు. ఈ దేశమూల సంస్కృతిలో భాగమయిన చార్వాక, లోకాయిత, జైన, బౌద్ధ జీవన విధానల గూర్చి లోతుగా అధ్యయనం చేశారు. చివరకు బుద్ధుని మార్గాన్ని ఎంచుకుని నవబౌద్ధుడిగా మారారు. ‘ఈ విశ్వంలో ప్రతిదీ కార్యకారణ సంబంధంతో జరు గుతూ ఉందన్న’ – బుద్ధుడి మాట వైజ్ఞానిక మేధావి అయిన ప్రొ.నరసుకు ఎందుకు నచ్చదూ? నచ్చింది! అందుకే బుద్ధుడి బాటలో నడుస్తూ. ఆయన బోధనల వెలుగుల్ని ప్రపంచానికి పంచారు.
ప్రతిభావంతుడైన విద్యావేత్తగా రాణించడం వల్ల మద్రాసులోనే పచియప్పన్ కళాశాలకు ప్రిన్సిపాల్ కాగలిగారు. బయటి ప్రపంచంతోనూ దగ్గరి సంబం ధాలు ఉంచుకోవడం వల్ల ”నేషనల్ ఫండ్ అండ్ ఇండ స్ట్రియల్ అసోసియోషన్” అనే సంస్థ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఈ అసోసియోషన్ ధనికుల నుండి అధిక మొత్తంలో విరాళాలు సేకరించి, ఆ డబ్బుతో ఉత్సాహవంతులైన యువకుల్ని జపాన్‌కు పంపుతూ ఉండేది. వారు అక్కడ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుని వచ్చిన తర్వాత వారిని ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసేవారు, ఇలాంటి కార్యక్రమాలు ప్రొ. లక్ష్మీ నరసు పర్యవేక్షణలో జరుగుతూ ఉండేవి. ఈయన అనుభవాన్ని ప్రజ్ఞను ఆ అసోసియోషన్ పూర్తిగా వాడుకునేది. ఒక వైపు విద్యావేత్తగా, విద్యాసంస్థ పరిపాలనాదక్షుడిగా తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే, మరో వైపు సమాజంలో కుల నిర్మూలన, బాల్యవివాహాలను అడ్డుకోవడం, విధవా పునర్వివాహాలు జరిపించడం వంటి వాటిపై దృష్టి పెట్టేవారు. హేతువాద దృక్పథంతో జీవితాన్ని తీర్చిదిద్దు కోవడం – వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండేవారు.
తెలుగువారి బలహీనత ఏమంటే తమలోని మంచిని ఎలుగెత్తి చెప్పుకోలేరు. అటు బెంగాలీలకు, ఇటు తమిళులకూ ఉన్న ఆత్మవిశ్వాసం ధైర్యం తెలుగువారికి లేదు. ఆ గౌరవం నిలుపుకోవడం వీరికి రాదు. తెలుగు వాడయినందుకే ప్రొఫెసర్ లక్ష్మీ నరసు పేరు జాతీయ స్థాయిలో వినిపించకుండా పోయింది. డా.బి.ఆర్. అంబేద్కర్‌నే ప్రభావితుణ్ణి చేశాడంటే మాటలు కాదు కాదా? గుంటూరు ప్రాంతానికి చెందిన శూద్రుల్లో కాపుకులానికి చెందిన లక్ష్మీ నరసు కుటుంబం మద్రాసు (తమిళనాడు)కు వలసవెళ్ళి అక్కడ స్థిరపడింది. ఆ నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని అసహ్యించుకున్న లక్ష్మీ నరసు – ఆ ప్రసక్తి అసలే లేని బౌద్ధంలోకి దారి వేసుకున్నారు. బ్రిటిష్ పాలనలో ఉండి, క్రిస్టియన్ విద్యాసంస్థలు విస్తరి స్తున్న దశలో, ఒక క్రిస్టియన్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ కూడా తనకు కావల్సిన సత్యమార్గాన్ని సమ్యక్ మార్గాన్ని ఆయన అన్వేషించుకున్నారు. దాన్నే ప్రచారం చేశారు. ఉధృతంగా క్రైస్తవంలోకి మతమార్పిడులు జరుగుతున్న ఆ దశలో ఆవేగాన్ని అడ్డుకుని, బౌద్ధం ప్రచారం చేయడం ఎంతకష్టమైన పనో ఊహించు కోవాల్సిందే. బ్రిటీషు ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ చేయడం మరింత కష్టం. అయినా సరే, ధీశాలి అయిన ప్రొ.నరసు లాంటి వారికే అది సాధ్యం! ఒక ధ్యేయాన్ని సాధించాలంటే తప్పదు – ఎన్ని ప్రతి బంధకాలు అడ్డొచ్చినా ముందడుగు వేయాల్సిందే! ప్రొ. లక్ష్మీ నరసు జీవితం ఈతరం యువతీ యువకులకు ఆదర్శం కావాలి, మత రాజకీయాలు చేస్తూ మారణకాండలు జరిపిస్తున్న ప్రభుత్వాలను ఎదుర్కో వాలంటే ఈ తరం యువతీ యువకులు ధైర్యంగా నిలబడక తప్పదు. తమకు కావల్సిన సమతా మార్గాన్ని ఎంచుకోక తప్పదు.
– సుప్రసిద్ద సాహితీ వేత్త విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.(మెల్బోర్న్ నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు