– రాజ్యాంగాన్ని మార్చేందుకు సంఫ్‌ు దీర్ఘకాలిక ఎజెండా
– బీజేపీ విజయాలకు ప్రతిపక్షాల వైఫల్యమే కారణం
– పార్లమెంటును పట్టించుకోని పాలకులు
– బాబాసాహెబ్ ఆశయాలు, ఆలోచనలు నేటికీ అనుసరణీయమే : ప్రకాశ్ అంబేద్కర్
న్యూఢిల్లీ: జాతి యావత్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం ఘనంగా జరుపుకొంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత వారసత్వం, నేటి పరిస్థితులలో ఆయన ప్రాధాన్యత, కులతత్వం విసురుతున్న సవాలు వంటి అంశాలపై అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) అధినేత ప్రకాష్ అంబేద్కర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇండియా బ్లాక్ ఇచ్చిన ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ అనే నినాదం బీజేపీని ఎలా దెబ్బతీసిందో వివరించారు. బాబా సాహెబ్ అందించిన సేవలనూ ప్రస్తావించారు. ఆ వివరాలు…
ప్రస్తుత పరిస్థితులలో అంబేద్కర్ ప్రాధాన్యతను మీరు ఎలా అంచనా వేస్తారు?
నేను దీనిని మూడు భాగాలుగా చూస్తాను. రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ప్రాధాన్యత. వీటి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. అయితే ఆ పని ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఈ సమస్యలను దేశం ఎదుర్కొంటున్నంత కాలం వాటికి శాశ్వత పరిష్కారాలు కనుగొనడానికి మనం అంబేద్కర్ ఆలోచనలు, కృషిని పరిశీలించాల్సి ఉంటుంది.
గత సంవత్సరం జరిగిన లోక్‌సభ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పు ప్రతిపక్షాల ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ అనే నినాదంపై కాదా?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అటు కేంద్రంలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రతిపక్షాల నినాదం పైనే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారంటే నేను నమ్మను. అందులో అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రతిపక్షాల వైఫల్యం. కాబట్టి బీజేపీ విజయాలను ప్రతిపక్షాల నినాదంపై ఇచ్చిన తీర్పుగా భావించకూడదు. రాజ్యాంగంపై ప్రమాణం చేయడం, దాని ప్రాథమిక సూత్రాలైన సమానత్వం, సోదరభావం, వాక్ స్వాతంత్య్రానికి అనుగుణంగా పనిచేయడం ఒకటి కాదు.
రాజ్యాంగానికి ఇప్పటికీ ముప్పు ఉందా?
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ హిందూ రాష్ట్ర అజెండాను ముందుకు తీసుకుపోవడానికి, రిజర్వేషన్ వ్యవస్థను వదిలించుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయి. ఇందుకోసం వాటికి దీర్ఘకాలిక అజెండా ఉంది. ఇది కేవలం రిజర్వేషన్ గురించి మాత్రమే కాదు. బీజేపీకి చెందిన హిందూత్వ శక్తులకు ముప్పు కలిగించే పెద్ద సైద్ధాంతిక సమస్య. ఇప్పుడో లేక తర్వాతో వారు దానిని సవాలు చేస్తారు. ఈ కోణంలో చూస్తే రాజ్యాంగాన్ని కాపాకునేందుకు జరుగుతున్న పోరాటంలో డాక్టర్ అంబేద్కర్ ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉన్నదని అనుకుంటున్నాను.
ఆర్థిక వ్యవస్థపై అంబేద్కర్ అభిప్రాయాలు ఏమిటి?
అవి ఇప్పటికీ సందర్భోచితమైనవేనా?
అంబేద్కర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గట్టిగా సమర్ధించారు. విధానపరమైన నిర్ణయాలన్నీ పార్లమెంటులో చర్చలు, వాటి ఫలితంగానే ఉండాలని బలంగా విశ్వసించారు. ఆర్థిక విధానాలను ముందుకు తీసుకుపోవడానికి పార్లమెంట్ ప్రధాన వేదికగా ఉండాలని భావించారు. పార్లమెంట్ అధీనంలో ఉండే ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహించాలని సూచించారు. ఆయన ప్రైవేటు రంగానికి వ్యతిరేకి కాదు. దీనికి ప్రతిగా ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడకుండా చూడడానికి పారిశ్రామికీకరణకు మద్దతు ఇచ్చారు. అయితే ఆయన పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా హెచ్చరికలు చేశారు. నేడు మనకు పనిచేసే పార్లమెంట్ ఉంది. కానీ ఆర్థిక నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతున్నాయా? ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు పార్లమెంటును పట్టించుకోకుండా కొన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది….
ఇది ఒక నిర్దిష్ట విధానం లేదా రాజకీయ పార్టీ గురించి కాదు. అధికారంలో ఉన్న వారు పార్లమెంట్ నియంత్రణలోని ఆర్థికవిధానానికి కట్టుబడి ఉంటే నూతన పారిశ్రామిక శక్తి కేంద్రాల ఏర్పాటును లేదా పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలను నివారించవచ్చు. ప్రజలను ఉద్ధరించడానికి ఆర్థిక నమూనా దోహదపడిందా అన్నది ప్రధాన ప్రశ్న. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఇది సాయపడిందా ? సామాన్యుల జీవనోపాధిని ఏ మేరకు మెరుగుపరచింది ? ఈ ప్రాథమిక విలువల ఆధారంగానే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ విజయాలను అంచనా వేయాల్సి ఉంది.
దళితులు, అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం డాక్టర్ అంబేద్కర్ గట్టిగా గళం విప్పారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటారు?
సామాజిక పరివర్తనను తీసుకురావడంలోనూ, పేదలు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతిలోనూ ఆయన నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. ఈ కృషిని కొనసాగిస్తూనే కుల, వర్గ వివక్షకు తావులేని సమాజాన్ని చూడాలని ఆయన కోరుకున్నారు. శారీరక వివక్ష కనిపించకపోవచ్చు కానీ మానసిక అడ్డంకులు ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికీ కులతత్వం ఉంది. అది ప్రజలలో లోతుగా పాతుకుపోయింది. ఈ వివక్ష నుండి బయటపడడమే తర్వాతి తరానికి పెద్ద సవాలు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ కృషి ఇప్పటికీ సందర్భోచితమైనదే. ప్రాధాన్యత కలిగినదే.