జూలై 10 కార్మికుల డిమాండ్స్ డే ని జయప్రదం చేయండి: సీఐటీయూ

– ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ ( సీఐటీయూ) జనరల్ బాడీ సమావేశం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
జూలై 10న జరిగే కార్మికుల డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని సెంటర్  ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ( సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్  కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు, ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు ) జనరల్ బాడీ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రీమియర్ యూనియన్  అధ్యక్షులు భూపాల్  మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తానని చెప్పిందని, సహజ వనరులైన బొగ్గు బావులను ప్రైవేటీకరణకు పూనుకున్నదని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాలలో కార్మికుల నిరసనలు, ధర్నాలు చేసి డిమాండ్స్ డే ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఈపీఎఫ్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించారని, దేశ సహజ వనరులైన బొగ్గు గనులను, దేశ సంపదను అమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం వేలం వేస్తున్నారని దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మికుల కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ కార్మికుల సమస్యలపై జూలై 10 కార్మికుల కోర్కెల దినాన్ని జయప్రదం చేయడంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి(జీఎస్) గా చెక్క రమేష్  ఏకగ్రీవం..
ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఎంప్లాయిస్  యూనియన్( సీఐటీయూ) నూతన సిఐటియు ప్రధాన కార్యదర్శి(జీఎస్) గా చెక్క రమేష్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వివిధ యూనియన్ల నుంచి సిఐటియు లో చేరికలు..
జి రాజు, జి నర్సింహులు, బి నర్సింహులు, కె కుమార్, యస్ కె అబ్జల్ తదితరులు వివిధ యూనియన్ల నుండి సీఐటీయూలో చేరారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ, ప్రీమియర్ యూనియన్ నాయకులు పుప్పాల గణేష్, స్థానిక మాజీ సర్పంచ్ భీమగాని రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love