– నియామకాలపై ఉదాశీనత
– అరకొరగా నిధుల మంజూరు
– బీజేపీ నేతలతో నిండిపోయిన ఎన్‌సీఎస్‌టీ
న్యూఢిల్లీ : దేశ ప్రధమ పౌరురాలు ఓ గిరిజన మహిళ. అయినప్పటికీ ఆదివాసీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కన్పించడం లేదు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన నోడల్ సంస్థ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ)ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఈ కమిషన్‌లో 70 నాన్-మెంబర్ (సభ్యులు కాని) పోస్టులు 70 ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు… ఎనిమిది నెలల పాటు ఖాళీగా ఉన్న ఛైర్మన్ పదవిని ఇటీవలే భర్తీ చేశారు. గత నెల 9న మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత అంతర్‌సింగ్ ఆర్యను ఎన్‌సీఎస్‌టీ ఛైర్మన్‌గా నియమించారు.
ఎస్టీ కమిషన్‌లో కీలకమైన ఐదు పోస్టులు ఫిబ్రవరి, మార్చిలో ఖాళీ అయ్యాయి. ఆ తర్వాత ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. వీరంతా బీజేపీ నాయకులే కావడం గమనార్హం. రాంచీ నగర మాజీ మేయర్, బీజేపీ నేత ఆశా లక్రా, బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు జతోతు హుస్సేన్ నాయక్, మిజోరం మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు నిరుపమ్ చక్మాకు ఈ పదవులు కట్టబెట్టారు. సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అండర్-సెక్రటరీ వంటి 70 నాన్-మెంబర్ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ కమిషన్‌లో అనేక పదవులను భర్తీ చేయకపోవడంతో దాని లక్ష్యమే దెబ్బతింటోందని యూపీఏ ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేసిన కేసీ దేవ్ చెప్పారు. సభ్యులు మాత్రమే ఫైల్స్, ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారాలను చూడలేరని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ఏ ప్రకారం ఎన్‌సీఎస్‌టీని ఏర్పాటు చేశారు. దీనిలో ప్రధానంగా ఐదుగురు సభ్యులు… ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, ముగ్గురు సభ్యులు…ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మోడీ ప్రభుత్వం అరకొరగా నిధులు కేటాయిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా కేటాయింపులు తగ్గిపోతుండడంతో ఎస్టీ కమిషన్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కమిషన్‌కు ఐదు సంవత్సరాల క్రితం రూ.20 కోట్లు కేటాయించగా 2022-23లో అది రూ.12 కోట్లకు తగ్గిపోయింది. కీలక సిబ్బంది లేకపోవడంతో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన గ్రూపుల పనితీరు కూడా కుంటుపడుతోంది. నివేదికలను సకాలంలో రూపొందించడం సాధ్యం కావడం లేదు. గత ఛైర్మన్ హర్ష్ చౌహాన్ ఓ కార్యాచరణ గ్రూపును ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత నూతన ఛైర్మన్ నియామకం జరగ్గానే ఈ గ్రూపు రద్దయింది. పదవీకాలం మరో ఎనిమిది నెలలు ఉన్నప్పటికీ హర్ష్ చౌహాన్ గత సంవత్సరం జనవరిలో రాజీనామా చేశారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖతో ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. 2022లో రూపొందించిన నూతన అటవీ పరిరక్షణ నిబంధనలను ఆయన వ్యతిరేకించారు. చౌహాన్‌కు అఖిల భారతీయ వనవాసి కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంఫ్‌ు పరివార్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.