ఉపాధి హామీపై కేంద్రం ఆంక్షలు

– జిల్లాల వారీగా చేపట్టే పనుల కార్యాచరణ సిద్ధం : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు, నిధులు, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసే దస్త్రంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఉపాధి హామీ పథకం కోసం ఈ ఏడాది రూ.2708.3 కోట్ల నిధులను మంజూరు చేశామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా చేపట్టే పనుల కార్యాచరణను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అందులో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్ల వస్తువుల కోసం కేటాయించామని వివరించారు. రాష్ట్రానికి ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు కేటాయించబడ్డాయని తెలిపారు. గతేడాది ఎనిమిది కోట్ల పనిదినాలను కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. కానీ డిమాండ్‌ అధికంగా ఉండటంతో 12 కోట్ల పనిదినాలను పూర్తి చేశామనీ, అందుకనుగుణంగా కేంద్రం అనుమతులి చ్చిందని వివరించారు. కానీ ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల దినాలను కేటాయించిందనీ, అంతకుమించి పనులను చేయించొద్దంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని విమర్శించారు. గతంలో మాదిరిగా డిమాండ్‌కు అనుగుణంగా పనిదినాలను పెంచబోమంటూ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కేటాయించిన పని దినాల ప్రకారమే పనులను చేయించాలంటూ ఆదేశాలిచ్చిందని తెలిపా రు. అవసరాలు, డిమాండ్‌ను బట్టి పనిదినాలను కేంద్రం పెంచకపోతే రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల కింద మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల వనాలు, వనమహో త్సవం, జల నిధి, రూరల్‌ శానిటేషన్‌, మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టనున్నట్టు వివరించారు. జిల్లాల వారీగా చేపట్టే పనులను ఆమోదించామని పేర్కొన్నారు. అవసరమైతే పనిదినాలను పెంచాలంటూ కేంద్రానికి లేఖ రాసే యోచనలో మంత్రి సీతక్క ఉన్నట్టు తెలిసింది.

Spread the love