ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు కేంద్రం పూర్తి బాధ్యత వహించాలి : సీతారాం ఏచూరి

నవతెలంగాణ – ఢిల్లీ : నీట్‌, యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దు అంశాలపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. నీట్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలతో పాటు యూజీసీ-నెట్‌ ఎగ్జాం రద్దు వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు.  నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన వ్యక్తుల గురించి రాజకీయాల్లో మనం విన్నామని, ధర్మేంద్ర ప్రధాన్‌ మాత్రం ఈ తరహా నిర్ణయానికి దూరంగా ఉన్నారని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌ సుస్పష్టమని, వీటిని బహిరంగంగా విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్ధలో ఈ రకమైన వాణిజ్య ధోరణులు ప్రబలుతున్నాయని చెప్పారు. ఈ అక్రమాలతో కోట్లాది మంది మన విద్యార్ధులు బలి అవుతున్నారని అన్నారు. దేశ భవిష్యత్‌కు కీలకమైన యువత భవితకు భరోసా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

Spread the love