కేంద్ర ప్రభుత్వం సీఏఏను సత్వరమే వెనక్కి తీసుకోవాలి: సీపీఐ

– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ ను వ్యతిరేకించాలని  సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు  డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షo భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణలో  అమలు చేయకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని కోరారు. ప్రజలు సామరస్యంగా జీవిస్తున్న ఈ దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. కేంద్రంలోని కాషాయ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, లౌకిక విలువలకు తూట్లు పొడిచే వినాశకర చర్యకు పూనుకుందని. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న మోదీ సర్కార్ మరో ముందడుగు వేసి లోక్ సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ (సవరణ) చట్టం-2019ను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం అహేతుకమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసి, ఉద్యమించినప్పటికీ, నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కుట్రను అమలులోకి తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. సీ ఏ ఏ చట్టం ‘వివక్షత’తో కూడినదని అన్నారు.మత-విభజన చట్టాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, రేగటి లింగయ్య, అనంతుల జానయ్య, ఐతరాజు లింగయ్య, రేగటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Spread the love