చంద్రబాబు కేసులు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు

 Chandrababu cases politics of Telugu statesఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైబర్‌నెట్‌ స్కాం కేసులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను సుప్రీం కోర్టు నవంబర్‌ తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం వూహించిన పరిణామమే. స్పష్టం గా తెలియకపోయినా ఇది త్వరగా ఒక కొలిక్కి రాబోదని మాత్రం అందరూ భావిం చారు. ఇప్పటి వరకూ ఎసిబి కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు మూడు చోట్ల కూడా న్యాయ మూర్తుల ఆదేశాలు స్పందనలూ ఆ విధ మైన సంకేతాలిస్తున్నాయి. వాస్తవానికి మొదట్లోనైతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత మాట్లాడుతూ కాస్త ముందు వెనకగా బెయిలు వచ్చేస్తుందన్నట్టే వ్యాఖ్యానించారు. సిద్ధార్థలూద్రా వంటి ప్రసిద్ధ అడ్వకేట్‌ ఎసిబి కోర్టుకు వచ్చి వాదిం చాక ఇక తిరుగుండదనీ చాలామంది అనుకున్నారు. జగన్‌ ప్రభుత్వం ఆయన్ను పదమూడు రోజులైనా కస్టడీలో వుంచాలని కక్షగా వుందని అది తీరిపోతే పర్వాలేదని లెక్కలేశారు. అయితే ఆ అంచనాలేవీ ఆచ రణలో నిజం కాలేదు. ఈ క్షణంలోనైతే చంద్రబాబుపై వున్న కేసుల భవిష్యత్తు అనిశ్చితంగానే వుంది. నవంబరు 9న కూడా విచారణ జరిగేది ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిలు గురించే. 8వ తేదీన క్వాష్‌ తీర్పు వస్తుందనే అంచనా వుంది. మేము రిజర్వు చేసిన ఆ తీర్పు వచ్చాక ఈ ఫైబర్‌ కేసు తీసుకుంటే బావుంటుందని జస్జిస్‌ అనిరుధ్‌ బోస్‌ అనడం కూడా అందుకు అవకాశమిస్తున్నది. ఏమైనా చంద్రబాబు అరెస్టు విచారణల తీరుతెన్నులు ప్రధానంగా ఏపీ రాజకీయాల్లోనే గాక తెలంగాణలోనూ ఒకింత చర్చనీయంగా మారాయి.
రెండు వైఖరులు
ప్రాథమికంగా ఈ విషయంలో రెండు వైఖరులు వున్నాయి. ఏదైనా ఆరోపణ వుంటే మామూలుగా అరెస్టు చేసి విచారించవచ్చు గానీ రాజకీయ కక్షతో రాత్రిపూట ఎక్కడో అరెస్టు చేయడం, వరుస కేసుల ఉచ్చు పన్నడం సరికాదన్న అభిప్రాయం అందరి లోనూ వుంది. దేశ వ్యాపితంగానూ ఎక్కువ మంది ఇదే భావం వెలిబుచ్చారు. అసలు తప్పు జరగనేలేదు అన్నీ అభూత కల్పనలేనన్న తెలుగుదేశం వాదన మరొకటి. రాజకీయాభిప్రాయాలు ఎలా వున్నా ఎసిబి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ విచారణ ప్రక్రియలో పాలుపంచుకున్న కొద్ది తీర్పులను బట్టి నిర్ణయాలు వుండే పరిస్థితి సహజంగా వస్తుంది. ఎందుకంటే కేసులు కోర్టుల్లో వున్నప్పుడు నిర్దోషిగా విడుదల చేయాలనే నినాదం ఇతరుల నుంచి వచ్చే అవకాశం వుండదు. గతంలో జగన్‌ పైన వున్న కేసులతో పోల్చి చూడడం కూడా రాజకీయ విమర్శల వరకూ చెల్లు తుంది గాని చట్టపరంగా నిలిచేది కాదు. మరో వైపున జైలు అధికారుల తీరు, చంద్రబాబు ఆరోగ్యంపై ఫిర్యా దులు వీటిని ప్రజాస్వామిక ప్రమాణాలతోనూ మాన వీయంగానూ పరిశీలించి చక్కదిద్దడం అవసరమవు తుంది. ఎసిబి కోర్టు వైద్య నివేదికలు కోరడం, ములా ఖత్‌లను పెంచడం వంటివి ఆ విధంగా వచ్చిన చర్యలే. ఇప్పుడు హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఆయన ఆరోగ్య సంబంధమైన వాదనలను విచారించే అవ కాశముంది. ఇవన్నీ కోర్టుల్లో జరుగుతుంటే బయట వైసీపీ నాయకులు మంత్రులు దాడి చేయడం మరో వైపున టీడీపీ నేతలు ఏ పొరపాటూ లేదని రక రకాలుగా వాదించడం ఆ రెండు పార్టీల తగాదాలో భాగమే. టీడీపీ నిరసనలను అడ్డుకోవడం ముంద స్తుగా గృహ నిర్బంధాలు అరెస్టులు చేయడం ప్రజా స్వామిక పద్ధతి కానేకాదు.
తనను అరెస్టు చేస్తారని బహిరం గంగా చెబుతూ వచ్చిన చంద్రబాబు ముందస్తు కోసం ఎందుకు ప్రయత్నిం చలేదనే సందేహాలు, వాటికి చాలా సమాధానాలు వున్నాయి. క్రిమినల్‌ కేసు గనక బెయిలు రాదనే మాట ఒకటైతే సిఐడి పెట్టిన సెక్షన్లు కూడా ముందస్తుకు అవకాశమిచ్చేలా లేవని న్యాయ నిపుణులు కొందరు చెప్పారు. చంద్రబాబు లాయర్లు ఎసిబి కోర్టు కస్టడీ ఇచ్చాక కూడా బెయిల్‌ గాకుండా గృహ నిర్బంధం కోరారు. బెయిలు కోసం హైకోర్టుకు వెళ్లడం గాక క్వాష్‌ పిటిషన్‌ వేసి మొత్తంగా ఆయనను తప్పించాలని కోరారు. ప్రభుత్వ సేవకులపై చర్య ప్రారంభించే ముందు పై అధికారి అనుమతి తీసుకోవాలని చెప్పే సెక్షన్‌ 17ఎ అమలు చేయలేదనే పాయింటుపైనే వాదించారు సిద్ధార్థ లూద్రా. హైకోర్టులో దాన్ని కొట్టివేశాక సుప్రీంకోర్టులోనూ అదే కొనసాగిస్తు న్నారు. ఇందులో ఇతర బహుముఖ ప్రయోజనాలు వుండొచ్చు. దీనిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. 2018లో స్కిల్‌ కేసు విచారణ ప్రారంభించే నాటికి 17ఎ లేదని, అసలు నేరాలు జరిగాయంటున్నది 2015-16 గనక అది అసలే వర్తించబోదని ప్రభుత్వ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ చెప్పారు. 17ఎ కింద గవర్నర్‌ అనుమతి తీసుకోవడం అనేది నిజాయితీ పరుల కోసం ఏర్పాటు చేసిన ఒక ముందు జాగ్రత్త తప్ప అవినీతికి రక్షణ ఛత్రం కాదని ప్రభుత్వం తరపున తదితరులు వాదించారు. హై కోర్టులో దీనిపై క్వాష్‌ను కొట్టివేసిన జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి కూడా అవినీతి చట్టం 17ఎ వర్తింపు ఎలా వున్నా ఇతర ఐపిసి సెక్షన్‌ కింద వున్న అభియో గాలైనా విచారించాలని చెప్పారు.
సుప్రీంలో వాదనలు
ప్రభుత్వాలు కక్ష సాధింపునకు పాల్పడకుండా నిరోధించడం కోసమే 17ఎ ఏర్పాటైందని సిద్ధార్థ లూద్రా హరీష్‌ సాల్వే పలుసార్లు చెప్పారు. ముఖ్య మంత్రిగా చంద్రబాబు అధికార విధినిర్వహణలో భాగంగా చేసిన వాటిపై దర్యాప్తు చేసేప్పుడు గవర్నర్‌ అనుమతి తీసుకోలేదు గనక అరెస్టు, తర్వాత రిమాండు ఉత్తర్వు చెల్లవనీ అప్పుడు కేసు నిలవదనీ వారు వాదించారు. చంద్రబాబుకు సంబంధం లేదం టూనే ఆయన విధినిర్వహణలో భాగంగా చేశారని చెప్పడం ఎలా పొసుగుతుందని రోహత్గీ ఎదురు వాదన చేశారు. అవినీతి కేసులతో పాటు ఐపిసి సెక్షన్లు కూడా వున్నాయి గనక వాటి కోసమైనా ఎసిబి కోర్టు విచారించవలసి వుంటుందని హైకోర్టు చెప్పిన సంగతి గుర్తు చేశారు. ఈ విచారణ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కేంద్రం ప్రారంభించింది కనుక కక్షసాధింపు ఆరోపణ అర్థం లేదనీ ఆయన సమర్థించారు. (అది జిఎస్‌టి ఎగవేతకు సంబం ధించిందే గానీ స్కిల్‌స్కామ్‌ కాదన్నది చంద్రబాబు లాయర్ల వాదన)17ఎ తో సమానమైన 6ఎ డిల్లీ స్పెషల్‌ పోలీస్‌ యాక్ట్‌(సిబిఐ) విషయంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా వుందని రోహత్గీ ఉదహరించారు. 17 ఎ సవరణ చేసేప్పుడు ఇది గతకాలానికి కూడా వర్తిస్తుందని నిర్ది ష్టంగా పేర్కొనలేదని మరో వాదన తీసుకొచ్చారు. కానీ అసహజ శృంగారం విషయంలో 377 సెక్షన్‌ను సవరించిపుడు అది గతంలో వున్న అలాంటి కేసులకు కూడా వర్తిస్తుంది కదా అని కోర్టు ప్రశ్నించినపుడు దాని స్వభావం వేరని రోహత్గీ వివరించారు. ఫెరా ఫెమా చట్టాలు మారినా పాత తప్పులు అలాగే వుం టాయన్న ఉదాహరణ ఇక్కడ వర్తిస్తుందన్నారు. ఒక నేరం జరిగిన తర్వాత చట్టం మారినా మౌలికంగా నేరం మాసిపోదన్నారు. రఫేల్‌ కేసులో సుప్రీంకోర్టు స్వయంగా 17ఎ వెనకటి కాలానికి కూడా వర్తి స్తుందని చెప్పినట్టు సాల్వే చెబితే అది కేవలం జస్టిస్‌ జోసఫ్‌ ఒక్కరి అభిప్రాయం మాత్రమేననీ, మిగిలిన ఇద్దరూ ఆ ప్రస్తావనే తేలేదని రోహత్గీ తెలిపారు. తాజాగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివ కుమార్‌ అక్రమాస్తుల కేసులోనూ 17ఎ వర్తించ బోదని హై కోర్టు చెప్పిన తీర్పును ఉంటంకించారు. అదే యడ్యూరప్ప విషయంలో గవర్నర్‌ అనుమతి నిరాకరించినా సిబిఐ చర్య తీసుకుంది. కానీ17 ఎ వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది.
రెండు రాష్ట్రాలపై ప్రభావం
క్వాష్‌పై తీర్పు ఇచ్చిన తర్వాత ముందస్తు బెయిల్‌ కేసు దీన్ని వింటే బావుంటుందని జస్టిస్‌ బోస్‌ సూచించగా అప్పటివరకూ అరెస్టు చేయకుండా గతం లో వున్న అవగాహనను కొనసాగించాలని లూద్రా కోరారు. ఇప్పటికే మరోకేసులో కస్టడీలో వున్న వారి విషయంలో మిగిలిన కేసులు కూడా అమలులోకి వస్తాయనీ, సాంకేతికంగా ముందస్తు బెయిలు అమలయ్యే అవకాశమే వుండదని ప్రభుత్వం తరపున రంజిత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. నవంబరు 8 వరకూ ఆగడానికి సిద్ధమేకానీ ఇప్పటికే వాటిపై ఎసిబి కోర్టు ముందు విచారణ జరుగుతున్నదని తెలి పారు. లూద్రా అభ్యర్థనపై 9వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. ఈ లోగా ఆరోగ్యం విషయమై హైకోర్టు వెకేషన్‌ బెంచిగనక ఏదైనా ఉపశమనం ఇచ్చే అవ కాశం మాత్రం ఇంకా వుంది, ఈ కొద్ది రోజుల వ్యవధిలో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఆ విధమైన వైఖరి తీసుకుంటుందా అనేది చూడవలసిందే. సాల్వే తన చివరి వాదనల్లో 17ఎ చంద్రబాబుకు మాత్రమే గాక స్కిల్‌ కేసు నిందితులైన అధికారులందరికీ వర్తిస్తుం దని చెప్పడం,అదివర్తిసే జరిగిన దర్యాప్తు మొత్తం నిలవదని వాదించడం గమనించదగింది. స్కాం అంటూ ఆరోపణలు వచ్చిన పుడు మొత్తం వదిలేస్తే ఎలా అన్నట్టు న్యాయమూర్తుల కొన్ని ప్రశ్నలుండటం గమనించదగింది. అవినీతి నిరోధక చట్టంలో ఒక అంశాన్ని చూపి ఆపితే అసలు అవినీతి నిరోధం అన్న మౌలిక లక్ష్యం దెబ్బ తింటుందని కూడా వ్యాఖ్యానించారు. సాంకేతికంగా 17ఎ వర్తింపు గురించి రోహత్గీని కూడా అంతే నిశితంగా ప్రశ్నించారు. చివరకు తీర్పు ఎలా వుంటుందనే దానిపై ఎవరి అంచనాలు ఆశలు వారికి వున్నా అవినీతి కేసుల పేరిట మోడీ హయాంలో చాలా చోట్ల హడావుడి జరుగుతున్న పరిస్థితుల్లో దీన్ని కూడా సుప్రీంకోర్టు తేలిగ్గా తీసుకోకపోవచ్చన్న అభిప్రాయం కూడా వుంది. బెయిల్‌ కోసం ప్రయ త్నించే బదులు 17ఎ పైనే కేంద్రీకరించాల్సింది కాదని క్వాష్‌ ఈ దశలో చెల్లదని కూడా అభిప్రాయా లున్నాయి.
ఈ మధ్యలో లోకేశ్‌ హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయినా కేంద్రం చేసిందేమీ లేదు. నిజానికి కేంద్రం ఆశీస్సు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగి వుండదని అత్యధికుల భావన. ఏ విధంగా చూసినా న్యాయపరంగానూ రాజకీయంగానూ చంద్రబాబుకూ తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద సవాలు. దీనిపై నిరస నల గురించి తెలంగాణలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఎన్నికల రీత్యా నెమ్మదిగా బీఆర్‌ఎస్‌ కూడా గొంతు కలిపిన సందర్భాలున్నాయి. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో నిరసనల గురించి వార్తలు వస్తున్నా ఏపీలో టీడీపీ ఆశించిన స్థాయిలో లేదనే వ్యాఖ్యలు వచ్చాయి. ఈ మధ్యలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల పొత్తు ప్రకటించినా నిరసనల్లో పాత్ర వహించింది తక్కువ. త్వరలో ఆ రెండు పార్టీల సమావేశంలో కార్యక్రమం నిర్ణయం కావచ్చు. టీడీపీ సీనియర్‌ నాయకుల కన్నా చంద్రబాబు కుటుంబ సభ్యులే ముందుండటం కొన్ని రాజకీయ సంకేతా లిస్తున్నది. బీజేపీపైన టీడీపీ పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు, సిఐడి అరెస్టులో కక్ష సాధింపున్నా కేసులు కోర్టులు విచారిస్తున్నందున తీర్పు కోసం చూడటం అనివార్యం.
తెలకపల్లి రవి

Spread the love