పాఠశాలల పనివేళలను ఉదయం 9.30కు మార్చండి

– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి టీఆర్టీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పనివేళలను ఉదయం 9.30కు ప్రారంభమయ్యేలా మార్చాలని టీఆర్టీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్‌, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయనీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులొస్తారని పేర్కొన్నారు. వర్షాకాలం, శీతాకాలంలో ఉదయం తొమ్మిది గంటలకల్లా విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవడం కష్టమవుతుందని వివరించారు. ఉదయమే పిల్లలు అల్పాహారం తిని రావాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలల పనివేళలను ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్చాలని కోరారు.

Spread the love