బాలల ‘తెలుగు బడి’.. విజ్ఞానాంశాల పాఠాల ‘సీడీ’

Children's 'Telugu Badi'..
Science Lessons CDబాల సాహిత్యం అంటే కేవలం పిల్లల కోసం రాసిన కథలు, ఇతర రూపాలు, ప్రక్రియల్లో వచ్చిన రచనలు మాత్రమే కాదు. బాలల సమగ్రాభివృద్ధికి, సర్వతోముఖ వికాసానికి ఉపయోగపడే ప్రతిదీ బాల సాహిత్యమే. బడి నుండి, ఇంటి నుండి, కార్యశాలలు మొదలుకుని అనేక వేదికలు బాలల సాహిత్య సృజనకు భూమికగా నిలుస్తున్నాయి. అందరూ అందులో భాగమై నిలుస్తున్నారు, అక్షరాలై మెరుస్తున్నరు. అందరూ అందుకోసం పూనుకున్నప్పటికీ ‘బడి’ గుడి లోనే పెద్దలు రాసిన పిల్లల సాహిత్యం, పిల్లల కోసం పిల్లలు రాసుకుంటున్న పిల్లల సాహిత్యం వస్తోంది… ఇది అక్షర సత్యం… నిజం కూడా!
కేవలం వినోదం కోసమే కాదు విజ్ఞానం కోసం, బాలల కోసం సాహిత్య సృజన చేస్తున్న వారిలో కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌ పాఠశాలలో తెలుగు బోధిస్తున్న కవి, రచయిత, రంగస్థల నటుడు, బాల వికాస కార్యకర్త, పిల్లల కోసం యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్న కూకట్ల తిరుపతి ఒకరు. కవిగా ‘మేలుకొలుపు’, ‘ఎర్రగాలులు’, ‘ఆరుద్ర పురుగు’, ‘మొలాటు’ వచన కవితా సంపుటాలు ప్రచురించాడు. ఆచార్య ఎన్‌.గోపి గారి రూపకల్పనలో వచ్చిన నానీల ప్రక్రియను చేపట్టి ‘పల్లె’ నానీ సంపుటాన్ని తీసుకొచ్చాడు. వచన కవిత్వం, గేయం, పద్యం, వ్యాసం ఇలా అన్ని రూపాల్లో రచనలు చేస్తున్న కూకట్ల తిరుపతి ‘చదువులమ్మ శతకం’ పేర పద్య కవిత్వాన్ని తెచ్చాడు. రచయిత, విమర్శకుడుగా కూడా కూకట్ల తన రచనలను తెచ్చాడు, వాటిలో ఎన్నీల ముచ్చట్ల సమయంలో ప్రచురించిన వివిధ కవితా సంకలనాలపై రాసిన వ్యాసాల సంపుటిగా ఎన్నీల ముచ్చట్ల సాహిత్యాన్ని ‘జల్లెడ’ పట్టాడు. సంపాదకునిగా కూడా తిరుపతి తనదైన భూమికను నిర్వహించాడు, వాటిలో ‘సోపతి’ ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ ప్రత్యేక సంచికతో పాటు ‘సోపతి-బులెటిన్‌ 2’తో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కవితా సంకలనం, బుద్ధ జయంతి కవితా సంకలనం, మానైటి కవితల ఊట-సినారె స్మృతి కవిత్వ సంకలనం, మచ్చ ప్రభాకర్‌ యాది కవితల సంకలనం, గుట్టల విధ్వంస వ్యతిరేక కవితా సంకలనాలకు సంపాదకులుగా ఉన్నారు.
తిరుపతి బాల సాహితీవేత్తేకాదు బాల వికాస కార్యకర్త కూడా. తన బడి పిల్లల కవితలతో 2017లో ‘నల్లాలం పూలు’, ‘ఎన్నీల ముచ్చట్లు’ కవితా సంకలనాలు తెచ్చాడు. త్వరలో నుస్తులాపూర్‌ బడి పిల్లల కథల సంకలనం ‘ఆటకోయిలలు’ఆవిష్కరణ కానుంది. బాల వికాసోద్యమంలో కృషికి చింతోజు బ్రహ్మయ్య బాలమణి పురస్కారంతో పాటు యువకవిగా జిల్లా యువ కవి పురస్కారం, గ్రామీణ కళాజ్యోతి పురస్కారం వంటి అనేక పురస్కారాలు, జిల్లా ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. నల్లాలంపూలు పుస్తకం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం లోని గంగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల కవితా సంకలనం. ఇందులో అమ్మ గురించి, నాన్న, గురువు, ఊరు, బడి, కవి, స్నేహం, పల్లె, ప్రకృతి ఇలా అనేక అంశాలు ఉన్నాయి. బాలల కోసం కథలు, గేయాలు రాసిన తిరుపతి ఉపాధ్యాయునిగా వాళ్ల కోసం తొలుత తెలుగు పాఠాలను, గేయాలను, కవితలను చక్కని ఆడియోలుగా యూట్యూబ్‌ ద్వారా అందించాడు. పిల్లల కోసం కథలు గేయాలు రాశాడు. బాల సాహిత్యం ”స్వభావ పూర్ణంగా, ప్రభావవంతంగా, స్ఫూర్తిమంతంగా ఉండాలో” అదే విధంగా, అదే కోవలో భాషా బోధన, అందులోని అంశాలు ఉండాలని భావించిన తిరుపతి ‘తెలుగుబడి’లో అదే చేసి చూపించాడు కూడా.
మొదటగా దోషరహితంగా చదవడం, రాయడం, సులువుగా నేర్చుకోవడం వంటివి ఇందులో చక్కగా చెప్పిన తిరుపతి సరళ పదాలు, గుణింత పదాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, వాటితో కూడిన వాక్యరచనల వంటివి విపులంగా వివరించారు. తెలుగు ప్రాంతంలోనే కాక తెలుగేతర ప్రాంతాల పిల్లలు చదువుకునేందుకు తెలుగు పండుగలు, తెలుగువారి ఆటలు, తెలుగు సామెతలు, తెలుగు జాతీయాలు, పొడుపు కథలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, సంవత్సరాలు, తెలుగు అంకెలను పిల్లలు ఆడుతూ, పాడుతూ నేర్చుకునేలా రాసాడు. తెలుగు భాష మూలాల్లోకి వెళ్ళి భాషతో పాటు, సాహిత్యం, సంస్కృతిని తెలుసుకునేలా పొందుపర్చాడు. ఈ పుస్తకం ఇప్పుడు ఆస్ట్రేలియాలోని తెలుగు పిల్లలకు వాచకంగా ఉంది. మన దేశం లోని రాజస్థాన్‌, ముంబై, చెన్నై వంటి ప్రాంతాల్లోనూ ప్రసిద్ధి పొందింది. దీనిని యూట్యూబ్‌లో కూడా ఆయన ఉంచాడు. ఇంకాస్త ముందుకెళ్ళి ఇందులోని ప్రతిదానిని ‘క్యూ ఆర్‌ కోడ్‌’ ద్వారా స్కాన్‌ చేసుకుంటే చక్కగా వినొచ్చు కూడా. పిల్లలకు మాతృభాషా జ్ఞానాన్ని, తెలుగు విజ్ఞానాన్ని, ఆనందాన్ని అందించే చక్కని పుస్తకమిది. ఇంత చక్కని పుస్తకాన్ని అందించిన ఉపాధ్యాయ కవి, బాల సాహితీవేత్త, బాల వికాస కార్యకర్త, కూకట్ల తిరుపతి అభినందనీయులు. జయహౌ! బాల సాహిత్యం!
డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love