నల్లగొండ నూతన జిల్లా కలెక్టర్ గా చింతకుంట నారాయణరెడ్డి..

– జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి బదిలీ..
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కలెక్టర్  హరిచందన దాసరి  బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా చింతకుంట నారాయణరెడ్డి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలనా సంస్కరణల్లో భాగంగా శనివారం రాష్ట్రంలో భారీ ఎత్తున కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ బదిలీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న దాసరి హరిచందనను బదిలీ చేయగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా  పనిచేస్తున్న చింతకుంట నారాయణరెడ్డిని నల్గొండ జిల్లాకు బదిలీ చేసింది. నూతన కలెక్టర్ గా రానున్న నారాయణరెడ్డి కి జిల్లాపై పూర్తి పట్టు ఉంది. నారాయణరెడ్డి 11 అక్టోబర్ 2016 నుండి 4 మార్చి 2019 వరకు నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా రెండున్నర సంవత్సరాల పాటు పని చేశారు. బదిలీ అయిన కలెక్టర్ దాసరి హరి చందన కేవలం ఐదు నెలలపాటు నల్లగొండ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. 8 జనవరి 2024 న నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హరిచందన ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో, క్రింది స్థాయి ఉద్యోగులను కలుపుకొని పోయి జిల్లాలో తనకంటూ మంచి పేరును తెచ్చుకుంది. హరిచందన కలెక్టర్ గా పార్లమెంట్ ఎన్నికలను, వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సమర్థవంతంగా నిర్వహించింది. మూడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన దాసరి హరిచందన ఎన్నికల నిర్వహించడంలో పూర్తిగా విజయవంతమైంది.
కలెక్టర్ నారాయణరెడ్డి జననం..
చింతకుంట నారాయణరెడ్డి నారాయణపేట జిల్లా, నర్వ మండలం, శ్రీపురం గ్రామంలో జన్మించారు.
విద్యాభ్యాసం..
నారాయణరెడ్డి మూడవ తరగతి వరకు శ్రీపురం గ్రామంలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం నాలుగు నుండి ఏడవ తరగతి వరకు కల్వాల్లో, 8 వ తరగతి  నుండి ఇంటర్ వరకు మక్తల్ లో, డిగ్రీ నారాయణఖేడ్ లో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడి, ఎమ్మెస్సీ (మ్యాస్ ) పూర్తి చేశారు.
టీచర్ టు కలెక్టర్..
బీఈడీ పూర్తి చేసిన నారాయణరెడ్డి 2006 డీఎస్సీలో జిల్లా టాపర్ గా నిలిచారు. ఉపాధ్యాయునిగా చేస్తూనే గ్రూప్స్ కు  ప్రిపేర్ అయ్యి 2009 గ్రూప్ 1 లో రాష్ట్ర నాలుగవ ర్యాంకు సాధించారు. 2011లో  గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట లో  ఆర్డీవో గా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా అవకాశం వచ్చింది. దీంతో 11 అక్టోబర్ 2016 నుండి 4 మార్చి 2019 వరకు నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. జాయింట్ కలెక్టర్ గా నల్లగొండ జిల్లాలో  తనదైన పాలనా ముద్ర వేశారు.
తొమ్మిదవ కలెక్టర్ గా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నల్లగొండ జిల్లా 9 వ జిల్లా  కలెక్టర్ గా బాధ్యతలను నారాయణరెడ్డి  చేపట్టనున్నారు. రెండు రోజులు సెలవులు  కావడంతో బుధవారం లేదా గురువారం నాడు జిల్లా కలెక్టర్ గా  నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించే  అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా నుండి బదిలీపై వెళ్తున్న హరిచందన  దాసరి కి మాత్రం  రాష్ట్ర ప్రభుత్వం  ఇంకా పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు.
Spread the love