
నవతెలంగాణ – కంటేశ్వర్
అంగన్వాడి ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ, అంగన్వాడి కేంద్రాలలో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ నూర్జహాన్ లు మాట్లాడుతూ..ఐసీడీఎస్ బలోపేతంపైన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల పరిష్కారంపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాము. నిన్న 2024 మార్చి 2న గౌరవ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఐసీడీఎస్ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం అంగన్వాడీ కేంద్రాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రిగారు అధికారులను ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చింది. అంగన్వాడీ టీచర్స్, హెల్ఫర్సు దొంగలుగా ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచి, ఎలా బలోపేతం చేయాలనే అంశాలు సమావేశంలో చర్చించలేదు. 48 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకునే చర్యలు సమావేశంలో చర్చించలేడు. అన్నింటిని పక్కన బెట్టి పేద ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్న అవినీతిపరులని ఆరోపించడం అత్యంత దుర్మార్గం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి.ఐసీడీఎస్ 1975 అక్టోబర్ 2న ఏర్పడింది. 48 సంవత్సరాలు కావొస్తుంది. అయినా 60% కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. 90% కేంద్రాలకు బాత్రూములు, మంచినీటి సౌకర్యం, కరెంట్, కాంపౌండ్వాల్స్ లేవు, అంగన్వాడీ కేంద్రాలలో డబుల్ సిలిండర్ లేదు. 10 సం॥రాలైనా ఆరోగ్య లక్ష్మి మెసూచార్జీలు పెంచలేదు. కేంద్రాలలో బీరువాలు, టేబుల్స్, కుర్చీలు లేవు. సరిపడా వంట పాత్రలు ఇవ్వట్లేదు. కూరగాయలు, పాలు భద్రపర్చుకోవడానికి ఫ్రిజ్లు లేవు, సోప్స్, చీపుర్లు, బిండెలు, బక్కెట్లు ఇవ్వట్లేదు. పోషకాహారం నాణ్యత అస్సలు లేదు. పురుగుల బియ్యం, ముక్కిపోయిన పప్పు, మురిగిపోయిన కోడిగుడ్లు ప్రభుత్వం సప్లై చేస్తుంది. 50 గ్రాముల గుడ్డు అసలు సప్లై చేయడం లేదు. అతి చిన్నవి పిట్టగుడ్లలాంటివి సప్లై చేస్తున్నారు. 2 నెలల నుండి బియ్యం, పప్పు, పాలు, నూనె అంగన్వాడీ కేంద్రాలలో లేవు. అంటే ప్రభుత్వం సప్లై చేయటం లేదు. గ్యాస్ బిల్లులు ఇవ్వడం లేదు. సెంటర్ అద్దెలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు సౌకర్యాలు లేక అస్తవ్యస్తంగా ఉన్నాయి. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ కాదు పెట్టాల్సింది ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచి, సౌకర్యాలు కల్పించి ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలి.48 సంవత్సరాల నుండి పని చేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్సు నేటికీ పర్మినెంట్ చేయలేదు. కనీస వేతనం, పెన్షన్, ఇ.ఎస్.ఐ., ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఎన్నికలకు ముందు 24 రోజులు అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు. గత ప్రభుత్వం నిర్దిష్టంగా హామీలిచ్చింది. ఈ హామీలను అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో. పెట్టిన 18వేల వేతనం, పి. ఎఫ్ సౌకర్యంపైన నేటికి స్పందించట్లేదు. కనీసం 24 రోజుల సమ్మె కాలం వేతనాలు కూడా నేటికి చెల్లించలేదు. ప్రతి నెల జీతం కూడా చెల్లించట్లేదు. ఐసిడిఎస్ తో పాటు బి.ఎల్.ఓ ప్రభుత్వం చెప్పే అనేక సర్వేలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకుండా దొంగలుగా చిత్రీకరించడం దుర్మార్గం. ఐసీడీఎస్ పర్యవేక్షణ కోసం సూపర్వైజర్స్, సీడీపీఓ, డిడబ్ల్యుఓ లున్నారు. పోషకాహారం పర్యవేక్షణ కోసం ఆన్లైన్ పోషన్ ట్రాక్టర్, ఆరోగ్యలక్ష్మి తదితర యాప్స్ అనేకం ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపైన ఈ యాప్స్ నిమిష నిమిషానికి ఫోటోలు అంగన్వాడీ ఉద్యోగులు పెడుతున్నారు. ఇప్పటికే పర్యవేక్షణ చాలా ఎక్కువైంది. ఇంకా కొత్త ప్రయోగాలు ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. అనేక సర్వేల పేరుతో బయట తిరిగే అంగన్వాడీ ఉద్యోగులకు బయోమెట్రిక్ సరైంది కాదు.పెట్టాల్సింది సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ కాదు, ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచి, ఐలోపేతం చేసినప్పుడు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు సజావుగా ముందుగా సాగుతాయి. వీటితో పాటు క్వాలిటీతో కూడిన పోషకాహారం సప్లై చేసే విధంగా ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టు వ్యవస్థపైన ప్రభుత్వం నిఘా పెట్టాలి. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలి. లేనట్లైతే మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పి స్వర్ణ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.