
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్ లను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాసు, ఏఐటీయూ జిల్లా నాయకులు రాజారాం ,శ్యాంసుందర్ ప్రగతిశీల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు పేర్ల నాగయ్యలు కోరారు. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బంద్ ను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఉన్న సంపదను కొద్దిమంది చేతుల్లో పెట్టి ఎక్కువ శాతం ఉన్న పేద మధ్యతరగతి వర్గాలకు అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు భారీ ఎత్తున రాయితీలు ఇస్తూ పేద ప్రజలను కార్మికులను రైతులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ మన దేశ రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాన్ని కించపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయలేకపోతుందని అన్నారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిందని,ఇ దేంటి అని అడిగే వారిని నిర్బంధించడం జైల్లో పెట్టడం జరుగుతుందని అన్నారు. అందుకే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ 16న జరిగే బందుకు అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకుడు పల్లా సుదర్శన్, విష్ణుమూర్తి,దుర్గయ్య,గొడ్డలి నరసయ్య,నాగరాజు, పరుశురాం,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.