ఏపీ ప్రభుత్వానిది అడ్డగోలు నీటి దోపిడీ
కేఆర్‌ఎంబీది ప్రేక్షకపాత్రే
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలి
మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కృష్ణా జలాల దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనంగా ఉండడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా దోపిడీ చేస్తున్నదని సోమవారం ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం అడ్డుగోలుగా నీటిని తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి తీరని నష్టమని తెలిపారు. నీటి కేటాయింపులు లేకున్నా వరద జలాలు రాకున్నా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నదని పేర్కొన్నారు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే ఏపీ ప్రభుత్వం నీటి హక్కులపై దండెత్తి కృష్ణాజలాలను తరలిస్తున్నదని తెలిపారు. బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాలువ ఇప్పుడు వెలిగొండ ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తున్నదని పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కేఆర్‌ఎంబీ సైతం ప్రేక్షకపాత్ర వహించడం దుర్మార్గమని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను ఎవరు కాపాడాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తక్షణమే స్పందించాలనీ, కేఆర్‌ఎంబీపై ఒత్తిడి తెచ్చి కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులను నింపి ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకం : హరీశ్‌రావు
రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులంలో చదివి పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణహత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని సోమవారం ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆస్తులకే కాకుండా ప్రజల ప్రాణాలకూ భద్రత లేకుండా పోయిందని తెలిపారు. మహిళలకు భద్రత కల్పించలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా?అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలనీ, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణాజలాలపై సీఎం మౌనం.. తెలంగాణకు తీరని ద్రోహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



