Tuesday, September 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిపక్ష నేతగా కేసీఆర్‌ ఫెయిల్‌

విపక్ష నేతగా కేసీఆర్‌ ఫెయిల్‌

- Advertisement -

ఆయనకు, నాకు పోలిక ఏంటీ..
వెయ్యిరోజుల్లో ఒక్కరోజైనా బయటకు వచ్చారా?
కేసీఆర్‌ రాజీనామా చేయాలంటూ ఆరు రోజులపాటు ఆందోళనలు
రెండేండ్లలోనే మూసారాంబాగ్‌ ‌వంతెన పూర్తి
వచ్చే ఏడాది రెండువేల పడకలతో ఉస్మానియా ఆస్పత్రి ప్రారంభం
ముసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌‌రెడ్డి


నవతెలంగాణ -అంబర్‌పేట
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ కేసీఆర్‌కు.. నాకు పోలిక ఏంటి ?.. కేసీఆర్ సీఎం అయితే ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు పదవులు కట్టబెట్టారు.. నేను సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చాను’’ అని సీఎం అన్నారు. దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత వైఫల్యం చెందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. వెయ్యిరోజుల్లో ఒక్కరోజైనా ఆయన జనం కోసం బయటకు రాలేదని తెలిపారు. ‘పదేండ్లలో మీరు ఏం చేశారో.. రెండున్నరేండ్లలో మేం ఏం చేశామో అసెంబ్లీలో చర్చకు సిద్ధం’ అని సీఎం సవాల్‌‌ విసిరారు. ప్రజల కోసం పనిచేయని కేసీఆర్‌.. పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎంపీ వి. హనుమంతరావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌‌తో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ​హైదరాబాద్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని రేవంత్‌‌రెడ్డి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తు న్నామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వరదల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మూసారాంబాగ్‌ వంతెన ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. అంబర్‌పేటలో గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించలేదని ఆరోపించారు. పేదల కష్టాలు తమకు తెలుసని, అందుకే వారికి ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. బతుకమ్మకుంటను ఆక్రమణల నుంచి విముక్తి చేసి ఆడబిడ్డలకు బహుమతిగా ఇచ్చామని తెలిపారు. కానీ మళ్లీ బతుకమ్మకుంట కబ్జాకు యత్నిస్తున్నారంటూ తెలిపారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్నాం తప్ప విల్లాలు, ఫామ్‌‌హోస్‌‌లు నిర్మించడం లేదని స్పష్టం చేశారు. హైడ్రాపైనా, తనపైనా కొంతమంది పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కబ్జాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని తెలిపారు.

​ప్రజాపాలనకు 1000 రోజులు
ప్రజాపాలన ఏర్పడి 1000 రోజులు పూర్తయ్యాయని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం విఫలమైందని కొందరు ఆరోపిస్తున్నారనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయామని అన్నారు. ధనిక రాష్ట్రంగా అప్పగించిన తెలంగాణను గత ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ప్రస్తుతం నెలకు సుమారు రూ.7,500 కోట్ల మేర అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. గతంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేవి కావని, తమ ప్రభుత్వం ఒకటో తేదీన వారికి వేతనాలు చెల్లిస్తోందన్నారు. 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల రిటైర్మెం ట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, తమ ప్రభుత్వం రెండేండ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం.. ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు కట్టామ న్నారు. రైతుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తాము అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ఏనాడైనా రేషన్‌ కార్డుల గురించి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.

​ప్రముఖుల పేర్లు పెడతాం
అల్వాల్‌ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య పేరు, వరంగల్‌ టిమ్స్‌కు ప్రొ. జయశంకర్‌ పేరు, ఎల్బీనగర్‌ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెడతామని సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు ఉద్యమించాలి కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష నేత రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వెయ్యి రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రూ.22.24 కోట్ల ప్రభుత్వ వేతనం తీసుకున్నారు. కానీ ఒక్కసారైనా బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. మంగళవారం నుంచి ఆరు రోజులపాటు ప్రధాన ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలంటూ ఊరూరా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -