
నవతెలంగాణ – మాక్లూర్
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని ముల్లంగి (బి), బొంకన్ పల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాన్ని, పాఠశాలల్లో వంట గది, వరండా, అదనపు గదులు, వాటర్ సంప్, టాయిలెట్స్ తదితర నిర్మాణాలు, మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా జరుగుతోందా, వాటర్ సప్లై కనెక్షన్ ఉందా, నీటి సరఫరా విషయమై సర్వే బృందాలు వచ్చి వివరాలు సేకరించాయా? అని ఆరా తీశారు. ఇప్పటికే చాలావరకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, ఇంకనూ పలు స్కూళ్లలో వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. వర్షాకాలం సీజన్ అయినందున పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకుని, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాలల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. నర్సరీని సందర్శించిన సందర్భంగా, ఆయా రకాల మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. మండల ప్రత్యేక అధికారి ముత్తెన్న, ఎంపీడీఓ క్రాంతి, తహశీల్దార్ షబ్బీర్, పంచాతీరాజ్ ముల్లంగి గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఉమామ తదితరులు పాల్గొన్నారు.