రెండు మూడు రోజుల్లో పెండింగ్ సమస్యల పరిష్కారం: కలెక్టర్

– డేటా సవరణకు సంబంధించినవి15 రోజుల్లో పరిష్కారం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నిటిని రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని, డేటా కరెక్షన్ కు సంబంధించిన దరఖాస్తులను 15 రోజులలో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ దాసరి చందన రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ కు తెలిపారు. శుక్రవారం ధరణి, రాష్ట్ర ప్రజావాణి దరఖాస్తుల పెండింగ్ పై రాష్ట్ర రెవెన్యూ  ప్రిన్సిపాల్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లు,రెవెన్యూ అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ధరణి పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ వివరణ ఇస్తూ కోర్ట్ కేసులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని, డేటా  సవరణకు సంబంధించినవి15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.కొన్ని దరఖాస్తుల పై  క్షేత్రస్థాయిలో ఇదివరకే తనిఖీ చేయడం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని, స్కానింగ్ సమస్యల వల్ల  కొన్ని ఆలస్యం అవుతున్నట్లు ఆమె తెలిపారు. ధరణి దరఖాస్తుల పరిష్కారమై ప్రతిరోజు  తహసిల్దారులు ఆర్డీవోలతో సమీక్షిస్తున్నానని, వెంటనే అన్ని దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ధరణిలో ఉన్న దరఖాస్తులన్నింటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పోర్టల్ లో  ఉన్న దరఖాస్థూలన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని  ఆర్డిఓ లు, తహసిల్దార్లతో  ప్రతి రోజు సమీక్షించాలని, పెండింగ్ ఎక్కువగా ఉన్న మండలాలపై ఎక్కువ  దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సైతం త్వరితగతిన పరిష్కరించాలని,వాటికి  ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవోలు, తహసిల్దారులు, పాల్గొన్నారు.
Spread the love