
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అత్యవసర పనులను చేపట్టి జూన్ 10 నాటికి పనులు పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.పాఠశాలల్లో అత్యవసర పనులు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టించడం వంటి అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో హైదరాబాద్ నుండి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గుర్తించిన అత్యవసర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా తరగతి గదుల్లో చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్తు పనులు, వాల్ టైల్స్, బాలికల టాయిలెట్లు, మంచినీటి కుళాయిలు, ఫ్లోరింగ్ టైల్స్, తలుపులు, కిటికీలు వంటివి చేపట్టి జూన్ 10 లోపు వీటన్నిటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నింటిని గ్రామ, మండల, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా చేయించాలని తెలిపారు. తక్షణమే పనులను గుర్తించి , ప్రతి మండలానికి ఒక ఇంజనీరింగ్ ఏజెన్సీ గుర్తించాలన్నారు. పాఠశాలల్లో అత్యవసర పనుల నిమిత్తం ముందుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని, పనులను గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాలకు పనులు అప్పగించాలని, వెంటనే పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని, సూక్ష్మస్థాయిలో ప్రణాళిక రూపొందించాలని, పట్టణ స్థాయిలో పట్టణ మురికివాడల ఫెడరేషన్లకు పనులు ఇవ్వాలని, పనులు నాణ్యతగా ఉండాలని తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టించే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకె నిర్ణయించిందని, అందువల్ల స్వయం సహాయక సంఘాలలో మహిళా టైలర్ లను గుర్తించాలని వారి సామర్థ్యం ఆధారంగా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ లుకుట్టే బాధ్యతను అప్పగించాలని అన్నారు.
అధికారులతో కలెక్టర్ రివ్యూ సమావేశం: వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఇంజనీరింగ్ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తక్షణమే మండలాల వారిగా పనులను గుర్తించి ఆయా ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాలని, స్వయం సహాయక మహిళా సంఘాలు పనులు నిర్వహించే విధంగా ఇంజనీరింగ్ శాఖలు చూడాలన్నారు. అందరు సంక్షేమ శాఖల అధికారులు స్వయం సహాయక మహిళా సంఘాలలోని మహిళా ట్రైలర్ జాబితాను రూపొందించి తక్షణమే అందించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, డిఆర్డిఓ నాగిరెడ్డి, డిఇఓ బిక్షపతి, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు హాజరయ్యారు.