Wednesday, May 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌కలెక్టర్లదే బాధ్యత

‌కలెక్టర్లదే బాధ్యత

- Advertisement -

ధాన్యం, మక్కలు కొనుగోళ్లు చేపట్టాలి
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
గోడౌన్లు, తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి
లారీలు అందుబాటులో లేకుంటే కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
రోజువారీ రిపోర్టులు సీఎస్‌‌కు ఇవ్వండి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి స్పష్టంచేశారు. దానికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలనీ, విధి నిర్వహణలో అలసత్వం ప్రదరిస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్‌ కు తరలించాలని ఆదేశించారు. ధాన్యం లోడ్‌ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దేనీ, అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని చెప్పారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. పలు చోట్ల గోడౌన్ల సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతుబజార్‌ లు, ఫంక్షన్‌ హాల్స్‌ను ఎంగేజ్‌ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్స్‌కు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

పోలీసుల సహాయం తీసుకోండి
మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలనీ, అవసరమైన చోట్ల పోలీసుల సహాయం తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి రిపోర్ట్‌ పంపించాలని ఆదేశించారు. అకాల నష్టనివారణకు శాశ్వత పరిష్కారాలు సూచించండి అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని చెప్పారు. ఐకేపీ కేంద్రాల్లో ప్రత్యేక అధికారిని నియమించడం ద్వారా కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతీ రైస్‌ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ధాన్యం లోడింగ్‌ లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని సూచించారు. ధాన్యం లోడ్‌ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల తాలు, తరుగు పేరుతో చేసే అక్రమాలను నిలువరించవచ్చని సూచించారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవన్నీ కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయనీ, ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా స్వీకరించేందుకు ముందుకు రావాలని చెప్పారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించండి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దష్టికి తీసుకురావలని, వాటి పరిష్కారానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తరలింపు వల్లే సమస్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కొందరు తమ ధాన్యాన్ని తెలంగాణలోని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారననీ, దీనివల్ల కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు ధాన్యం తీసుకురాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీతక్క, జూపల్లి కష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -