టెట్‌పై ఉపాధ్యాయుల్లో గందరగోళం

Confusion among teachers over Tet– ఏ పేపర్‌ ఎవరు రాయాలో స్పష్టత ఇవ్వని విద్యాశాఖ
– ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి
– ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పై ఉపాధ్యాయుల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లలో 2010, ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత మినహాయించబడింది. కానీ ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఆ నిబంధనను విద్యాశాఖ తొలగించింది. ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు ఎవరు రాయాలో, ఏ పేపర్‌ రాయాలో పేర్కొనలేదు. ఇది ఉపాధ్యాయుల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీస్తున్నది. ఈనెల 27 నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వాటి సమర్పణకు వచ్చేనెల పది వరకే గడువున్నది. దీంతో దరఖాస్తు చేయాలా? వద్దా?, ఏ పేపర్‌ రాయాలనే మీమాంసలో ఉపాధ్యాయులున్నారు. కానీ అధికారులు ఏమీ పట్టనట్టు వ్వహరిస్తున్నారు. ఆందోళన చేయాలన్నా ముఖ్యమంత్రి లేదా ప్రజా ప్రతినిధుల జోక్యం కోరాలన్నా ఎన్నికల కోడ్‌ ఆటంకంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులే స్పందించి టెట్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అన్ని సంఘాల నాయకులు ఐక్యంగా అధికారులను కలవటానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
పదోన్నతి పొందాలంటే టెట్‌ తప్పనిసరి
రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ), విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) 2009 ప్రకారం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి పదోన్నతి పొందాలంటే ఆ స్థాయికి సంబంధించిన పూర్తి అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి పొందాలంటే ఎన్‌సీటీఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలంటూ 2023, సెప్టెంబర్‌ 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత కావాలి. 2014, నవంబర్‌ 12న ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియెట్‌గా ఐదు స్థాయిలుగా పాఠశాలలను విభజించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకే టెట్‌ అవసరమని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది.
ఉపాధ్యాయుల్లో సందేహాలు
8 ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు (పీఎస్‌హెచ్‌ఎం (ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం)) పోస్టులు రెండూ ఒకే స్థాయికి చెందినవి. 2010, ఆగస్టు 23కు ముందే ఎస్జీటీగా నియామకమైన ఉపాధ్యాయులు పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతి పొందాలంటే టెట్‌ పేపర్‌-1 ఉత్తీర్ణత కావాలా? వద్దా? స్పష్టత ఇవ్వాలి.
8 టెట్‌ నోటిఫికేషన్‌లో ఇంటర్‌, డీఎడ్‌ అర్హత ఉన్నవారు మాత్రమే టెట్‌ పేపర్‌ -1 రాయటానికి అర్హులు. కానీ 2010కి ముందు ఇంటర్‌, టీటీసీ/డీఎడ్‌, డిగ్రీ, బీఎడ్‌ అర్హతలు కలిగిన వారు కూడా ఎస్జీటీలుగా నియామకమయ్యారు. పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతికి టెట్‌ పేపర్‌-1 తప్పనిసరి చేస్తే వారందరూ ఆ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఒకే స్థాయిలో పదోన్నతి పొందుతున్న ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు వర్తింపజేయాలి.
8 స్కూల్‌ అసిస్టెంట్లు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధిస్తారు. ఆర్టీఈ చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అది వర్తిస్తుంది. తొమ్మిది, పది తరగతులకు టెట్‌ నిబంధన వర్తించదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు జీహెచ్‌ఎం పదోన్నతి కోసం టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత కావాల్సిన అవసరం లేదు. కావున ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
8 భాషా పండితులు (ఎల్పీలు) ప్రాథమికోన్నత (6,7,8 తరగతులు) పాఠశాలల్లో నియమించబడ్డారు. వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ (భాషలు)గా ఉన్నత పాఠశాల స్థాయికి పదోన్నతి కల్పించే సందర్భంలో ఆర్టీఈ చట్టం ప్రకారం టెట్‌ నిబంధన వర్తించదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి కోసం టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత కావాల్సిన అవసరం లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పష్టతనివ్వాలి.
8 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ప్రాథమిక స్థాయి ఎస్జీటీ నుంచి ప్రాథమికోన్నత స్థాయి స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి పొందాల్సిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత కావాలనే నిబంధన వర్తిస్తుంది. దీనిపైనా స్పష్టత కావాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఎన్‌సీటీఈ అనుమతితో ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
2010, ఆగస్టు 23కు ముందే నియామకమైన ఉపాధ్యాయులు టెట్‌ అర్హత నుంచి మినహాయించబడ్డారని గత పదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్‌ రాయటానికి గరిష్ట వయోపరిమితి 44 ఏండ్లుగా నిర్ణయించబడిందని పేర్కొన్నారు. ఆ కారణాలతో ఇప్పటివరకు పలువురు ఉపాధ్యాయులు టెట్‌ రాయాలనే ఆలోచన చేయలేదని వివరించారు. ఇప్పుడు టెట్‌ సిలబస్‌ నిబంధనలతో పరీక్ష రాసి ఉత్తీర్ణత కావటం అంత సులువు కాదని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతికి టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయని పేర్కొన్నారు. అవసరమైతే విద్యారంగంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని ఎన్‌సీటీఈకి వివరించి అనుమతి తీసుకుని ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love