సెర్బియా పార్లమెంట్‌లో గందరగోళం

Chaos in the Serbian parliament– పొగబాంబులు విసిరిన ప్రతిపక్షం
– ముగ్గురు ఎంపీలకు గాయాలు
బెల్గ్రేడ్‌ : సభలో పొగ బాంబులు విసరడంతో మంగళవారం సెర్బియా పార్లమెంట్‌లో గందరగోళ దృశ్యాలునెలకొన్నాయి. ఈ సందర్భంగా ముగ్గురు పార్లమెంట్‌ సభ్యులు గాయపడగా వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశ్వవిద్యాలయ విద్యకు నిధుల పెంపునకు ఉద్దేశించిన చట్టంపై ఓటింగ్‌ జరగాల్సి వుంది. కానీ ఈ సమావేశమే చట్ట విరుద్ధమైనదని వాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ముందుగా ప్రధాని మిలోస్‌ వుసెవిక్‌ ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. సమావేశం ప్రారంభమైన గంట తర్వాత పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. సెర్బియా ఎదుగుతోంది, పాలన క్షీణిస్తోంది అని రాసి వున్న బ్యానర్‌ను చేబూని, ఈలలు ఊదుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో ఎంపీల మధ్య తొలుత ఘర్షణ మొదలైంది. ఆ వెంటనే పొగ బాంబులు విసురుకున్నారని బయటకు వచ్చిన వీడియోలను బట్టి తెలుస్తోంది. గ్రుడ్లు, నీళ్ళ సీసాలను కూడా ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రతిపక్షం తీవ్రవాదులుగా వ్యవహరిస్తోందని పార్లమెంట్‌ స్పీకర్‌ అనా బ్రనబిక్‌ విమర్శించారు. ఈ సంఘటనతో దేశంలో రాజకీయ సంక్షోభం ఎంతలా నెలకొందో స్పష్టమవుతోంది. నెలల తరబడి కొనసాగుతున్న అవినీతి వ్యతిరేక నిరసనలతో ప్రభుత్వం అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధాని వుసెవిక్‌ తన పదవికి జనవరిలో రాజీనామా చేశారు. పార్లమెంట్‌ ఇంకా దాన్ని ఆమోదించాల్సి వుంది.

Spread the love