అనూహ్య సాంకేతిక సమస్యలతో తొమ్మిది నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా దివి నుంచి భువికి దిగిరావటంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అంతేకాదు, సంతోష, హర్షాతిరేకాలను వెల్లడించింది.గుజరాత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయ కుటుంబంలో జన్మించి, పశువైద్యురాలు కావాలనుకున్న సునీతా విలియమ్స్(59) జీవితం అనేక మలుపులు తిరిగి అంతర్జాతీయ వ్యోమగామిగా మారటమే కాదు రికార్డులు సృష్టించింది. తొమ్మిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపేందుకు వెళ్లి అనూహ్యమైన సాంకేతిక కారణాలతో తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకు పోవటంతో వారికి ఏమౌతుందో అన్న ఆందోళన, ఆతురత యావత్ శాస్త్ర ప్రపంచం ప్రత్యేకించి అంతరిక్ష ప్రయోగాలలో నిమగ మైన వారిలో కనిపిం చింది. ఈ ఉదంతం పరిశోధనా సంస్థలకు, వ్యోమ గాములుగా ఉన్న వారికి, భవిష్యత్‌లో కావాలనుకునేవారికి ఎన్నో అనుభవాలను నేర్పుతుంది, ఉత్తేజం కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సునీత నావికాదళంలో చేరి యుద్ధ హెలికాప్టర్లు నడపటంలో శిక్షణ పొంది ఇరాక్‌పై జరిగిన దాడి సన్నాహక కార్యకలాపాల్లో భాగస్వామిగా, నాసా వ్యోమగామిగా పనిచేశారు. మనదేశానికి చెందిన కల్పనా చావ్లా తర్వాత అంతరిక్ష యాత్ర చేసిన రెండవ మహిళగా, 62 గంటల ఆరు నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. స్పేస్‌వాకర్ల మొత్తంలో నాలుగవ స్థానంలో నిలిచి మహిళగా తన సత్తాను యావత్ ప్రపంచానికి చాటారు. వయస్సులో ఉన్నపుడు సాహసాలు చేసేందుకు ముందుకు రావటం వేరు, అరవయ్యవపడిలో ఆమె ధైర్యంతో అడుగు వేయడం వేరు. ఇది మహిళలకే కాదు యావత్ యువతకు ఎంతో ఉత్సాహం, ఉత్తేజాన్ని ఇచ్చిన ఆమెను ఎంత అభినందించినా తక్కువే.
ప్రతిదాన్ని చౌకబారు రాజకీయం చేయటంలో రాజకీయ నేతలు పెట్టింది పేరు. సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ తిరిగి రావటానికి చేసిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యల అంశంలో డోనాల్డ్ ట్రంప్ అదే చేశాడు. నాసా రూపొం దించిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమ స్యలు తలెత్తిన కారణంగా ఆలస్యం కావటం తర్వాత ఎలన్‌మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను సంప్రదించటం తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కావాలనే వ్యోమగాములను అంతరిక్ష కేంద్రంలో వదలి వేసినట్లు, తాను వారిని రక్షించేందుకు ఎలన్ మస్క్‌కు పురమాయించినట్లు చెప్పుకోవటం ట్రంప్‌కే చెల్లింది. నిజానికి ఇది బైడెన్ మీద విమర్శకంటే నాసా శాస్త్రవేత్తల కృషిని అవమానించటం తప్ప మరొకటి కాదు. స్పేస్‌ఎక్స్ అయినా నాసా అయినా ఆ సంస్థల్లో పని చేసేది శాస్త్రవేత్తలే. తమ పని జయప్రదంగా ప్రయోగించటం, సురక్షితంగా తీసుకురావటం తప్ప రాజకీయాలను పట్టించుకోబోమని నాసా ప్రతినిధి ఎంతో హుందాగా చెప్పాడు. ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు యావత్ శాస్త్ర ప్రపంచం సంబరాలు చేసుకుంటున్నది. నిమిషాల ప్రకారం నిర్దేశించిన కార్యక్రమంలో వారిని తీసుకువచ్చిన డ్రాగన్ 17గంటల పాటు ప్రయాణించి సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇదంతా మాయలు, మంత్రాలతో జరిగింది కాదు, సైన్సు సాధించిన విజయం.
కొంత మంది పెద్దలు మాధ్యమాల్లో ఈ కృషిని ప్రశంసించాల్సింది పోయి, దేవుడి కృపతోనే వారు సురక్షితంగా వచ్చారని వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి? ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు అభినందనలకు పరిమితమైతే అదో తీరు, మిగతా అంశాలపై నోరు మూసుకున్నా దేశానికి నష్టం లేదు, అలాంటి మాటలు మన శాస్త్రవేత్తల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాల్సిన పని లేదా? మన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి రాకెట్, ఉపగ్రహాల ప్రయోగం ముందు సుళ్లూరుపేట, తిరుపతి వెంకన్న సన్నిధిలో పూజలు చేస్తున్న తీరు తెన్నులు చూసిన తర్వాత ఇంతకంటే భిన్నమైన స్పందనలు ఎలా వస్తాయి? అన్నీ వేదాల్లోనే ఉన్నాయనే పెద్దలు, మన పూర్వీకులు ఉపయోగించిన పుష్పక విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని, పశ్చిమదేశాల వారు తస్కరించి విమానాలను రూపొందించారని చెప్పిన పోసుకోలు కబుర్ల గురించి తెలిసిందే. మనదేశ మూలాలున్న సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోతే ఆమెను రక్షించటానికి మన సంస్మృత పండితులు రంగంలోకి దిగి పుష్పక విమానాన్ని రూపొందించి తీసుకువచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఎవరేమనుకున్నప్పటికీ దేశం, ఖండాలతో నిమిత్తం లేకుండా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజ యానికి జేజేలు పలకాల్సిందే. సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం గడపాలని మనసారా కోరుకుందాం!