నవతెలంగాణ – తుంగతుర్తి: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేటి వరకు పావు వంతు ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని విమర్శించారు.లారీలు సక్రమంగా కేంద్రాలకు రాకపోవడం,ధాన్యం మిల్లుల వద్ద సకాలంలో దిగుమతి కాకపోవడం వలన,రైతులకు ఎదురుచూపులు తప్పక కల్లాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా…. మిల్లుల యజమానులు తాలూతరుగు పేరుతో కిలోల కొద్ది ధాన్యాన్ని కోతలు పెడుతుండడంతో రైతు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో అగమ్య గోచరంగా మారిందన్నారు.
కెసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని,నేటి కాంగ్రెస్ పాలనలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన రైతుకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని అన్నారు.నీరు ఇవ్వలేదు యూరియా ఇవ్వలేదు,కనీసం పంట కొనుగోలు ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా ఉందని అన్నారు.రైతు ప్రభుత్వంగా చెప్పుకునే నాయకులు ఏ ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతుల కష్టాల గురించి అడిగి తెలుసుకున్న పాపాన పోలేదన్నారు.12 సంవత్సరాల బిజెపి పాలనలో ఇప్పటికి నాలుగు సార్లు పేపర్ లీకేజీల వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయారని,వాటికి కారణమైన ఏ ఒక్కరిని ఇంతవరకు శిక్షించలేదన్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి లీకేజీకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ సర్పంచ్ యాకు నాయక్,నాయకులు పూర్ణనాయక్,రాములు నాయక్,వెంకటేష్,నాగమల్లు తదితరులు పాల్గొన్నారు.



