Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజిల్లా అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

- Advertisement -

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ
హరీశ్‌రావు చేతబడి చేస్తున్నట్టు 
నేను అనలేదు
ఆలయాల్లోకి వెళ్లి ఎలాంటి పూజలు చేశారో చెప్పాలి : టీపీసీసీ చీఫ్ మహే‌శ్‌‌కుమార్‌ ‌గౌడ్‌
నవతెలంగాణ-కంఠేశ్వర్

జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పష్టం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు చేతబడి చేస్తున్నట్టు తాను అనలేదని, కానీ కొన్ని ఆలయాల్లో ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత బీఆ‌ర్‌ఎస్ ప్రభుత్వ హ‌యాంలో సీఎంఆర్ రైస్ మిల్లులపై పెండింగ్‌‌లో ఉన్న బకాయిల వసూళ్లపై క్యాబినెట్‌లో తీర్మానం చేసినట్టు తెలిపారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చర్యలు తప్పవన్నారు. రైస్‌మిల్లుల అక్రమాలపై కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఆర్‌వోబీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో ఓటమి మోడీ పతనానికి నాంది అని తెలిపారు. రాష్ట్రంలో కేటీఆర్ పాదయాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. లింబాద్రిగుట్ట పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం సీట్లు సాధించడం ఖాయమని తెలిపారు. భారీ వర్షాల వల్ల ప్రాజెక్ట్ పనులకు జాప్యం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్న కేటీఆర్‌పై మహేశ్‌కుమార్‌గౌడ్ మరోసారి ఫైర్ అయ్యారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నీరు నిల్వదని చెప్పినా, పనులు చేపట్టడం కేవలం కమిషన్ల కోసమేనని ఆరోపించారు. ప్రాజెక్టంతా లోపభూయిష్టంగా జరిగిందని, లక్షల కోట్ల రూపాయలు గోదావరి పాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచన మేరకే పనులు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్‌రెడ్డి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -