కాకతాళీయమో, కాదో గాని భారతరత్న బాబా సాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి రోజే కాషాయ పరి వారం బాబ్రీ మసీదును కూల్చింది. భారత రాజ్యాంగ మన్నా, చర్చి, మసీదులన్నా వారికి చెప్పలే నంత కడుపు మంట. దేశ పౌరుల్లో పరమత ద్వేషభావాన్ని పెంచి అధి కారంలోకి రావడం కోసం వారు బాబ్రీ మసీదును లక్ష్యం చేసుకొన్నారు. ఇప్పుడు లౌకికతత్వం రాజకీయ ప్రజాస్వా మ్యం ప్రబోధించే భారత రాజ్యాంగాన్ని దాని విలువలను నీరుగార్చే పనిలో ఉన్నారు. సమానత్వం సౌభ్రాతృత్వ పౌరులందరికీ వర్తించే చట్టం, ప్రజలందరికీ జీవించే హక్కు భావప్రకటనా స్వేచ్ఛ వంటి విలువలకు పాడె కడ్తున్నారు.
భారత రాజ్యాంగం మతంతో నిమిత్తం లేకుండా దేశంలోని పౌరులందరినీ సమాన హోదా కల్పించింది. హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కోరుకున్నదే బీజేపీ కోరుకుంటున్నది. భారతదేశం హిందువులదని, ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు తమ నివాసాన్ని కొనసాగించాలనుకొంటే రెండవ తరగతి పౌరుల్లా, హిందువుకు లోబడి బతకాలని ఆ సంస్థల సిద్ధాంతం. వినాయక్ దామోదర్ సావర్కర్, మాధన్ సాదాశివ్‌రావ్, గోల్వాల్కర్ చాలా స్పష్టంగానే తమ రాతల్లో ఈ సిద్ధాంతాన్ని ప్రవచించారు. కాని భారత రాజ్యాంగం వారి వాదనను పట్టించుకోలేదు. పౌరులం దరికీ ఒకే విలువ గల ఓటు హక్కునిచ్చింది. కుల మతాలతో నిమిత్తం లేకుండా మహిళతో సహా భారత పౌరులందరికీ ఒకే రీతిగా చట్టాలు అమలవుతాయి. వారసత్వ చట్టాల్లో మాత్రం కొన్ని తేడాలున్నాయి.
భారతీయులందరూ ఒక జాతిగాదంటూ రెండు జాతుల సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది సావర్కర్. బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకొని అండమాన్ జైలు నుండి విడుదలయిన సావర్కర్ బ్రిటిష్ పాలకులకు ఇచ్చిన మాట ప్రకారం స్వాతంత్య్ర పోరాటం నుండి దూరంగా ఉన్నారు. హిందూ మహాసభకు అధ్యక్షడయ్యాడు. భారత దేశంలో హిందూ ముస్లింలు రెండు జాతులున్నాయని సిద్ధాంతీకరించారు. ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహ్మదలీ జిన్నా ఆ తర్వాత అదే వాదనను అందుకొన్నారు. ఫలితం భారతదేశ విభజన. విభజించు పాలిం చు విధానాన్ని వర్తింప చేసిన బ్రిటిష్ వలస పాలకులకు కావ ల్సింది అదే కాగా ఆర్‌ఎస్‌ఎస్ దాని పరివారం విభజన పాపాన్ని మొదట మహాత్మాగాంధీ నెత్తికి చుట్టింది. ఇప్పుడు నెహ్రు నెత్తికి చుడుతున్నారు. మహాత్ముడిపై గౌరవం ఒలకబోస్తూనే స్వాతం త్య్రోద్యమంలోకి విశాల ప్రజానీకాన్ని సమీకరించిన ఆయన కృషిపై దుప్పటి కప్పి ఆయన్ను స్వచ్ఛతకు పరిమితం చేశారు. పనిలోపనిగా స్వచ్ఛ భారత్ పేర 0.5 శాతం పన్నును జిఎన్‌టికి చేర్చారు.
రాజ్యాంగం రచనా సంఘానికి అంబేద్కర్ అధ్యక్షుడే అయినా అనేక రకాలైన సాంప్రదాయ వాదులతో కూడింది మన రాజ్యాంగసభ. ఆ సభలో కొందరు పెద్దలకు హిందూ మహాసభకు ఉండే ఛాందస, ఒంటెత్తు భావనలు ఉన్నాయి. అయినప్ప టికీ స్వాతంత్రోద్యమం నాటి విలువలపై ఆధార పడి భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. కానీ ”భారత రాజ్యాం గం మనది కాదు. మువ్వన్నెల జెండా మనది కాదు. భారత రాజ్యాంగం ఒక అతు కుల బొంత. పశ్చిమ దేశాల నుండి అక్కడ కొంత ఇక్కడ కొంత తెచ్చి జోడించారు. అది భారత్‌కు పనికి రాదు.” అంటూ కాషాయ దళాలు ఈసడిస్తుంటాయి. మువ్వన్నెల జెండా కూడా పశ్చిమ దేశాల తరహాలో ఉంది. మన జెండా కాషాయ రంగులో మధ్యలో ఒక చీలికలతో ఉండాలని వాదిస్తుం టారు. చిత్‌పవన్ బ్రాహ్మణులైన పేష్వా పాలకుల కాషాయ జెండానే మన జాతీయ జెండాగా ఉండాలని వారి అభిమతం.
కులమతాలతో నిమిత్తం లేకుండా ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలని చెప్పే మన చట్టాలు సహజంగానే వారికి జీర్ణం కానివి. వర్ణం ప్రకారం శిక్షలు, హక్కులు, ఆస్తులు ఉండాలని మనుస్మృతి చెప్తుంది. అందుకనే అంబేద్కర్ మనుస్మృతిని మహద్ పోరాటం సందర్భంగా మనుస్మృతిని తగలబెట్టారు. అలాంటి మనుస్మృతి సాంప్రదాయ వాదులకు శిరోధార్యం, మనుస్మృతిని తగలబెడితే వారు విలవిల్లాడుతారు. ఫ్యూడల్ ప్రభువుల ప్రాప కంతో వారి పాత్రతో మతతత్వ పార్టీలైన హిందూమహాసభ ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలీగ్ పుట్టుకొచ్చాయి. కనుక వాటికి ఇప్పటికీ ఫ్యూడల్ విలువల పట్ల మోజు. ఆ విలువలు కష్టజీవులనే కాదు, మహిళలనూ అణిచి ఉంచాలని చూస్తాయి. భారత రాజ్యాంగం మహిళలకు సమాన పౌరసత్వాన్ని కలిగిస్తోంది.
స్వాతంత్య్రపోరాటం సందర్భంగా సామాజిక ఆర్థిక రంగా ల్లో చేయాల్సిన పోరాటాన్ని, తన వర్గ స్వభావం వల్ల కాంగ్రెస్ నాయకత్వం వాయిదా వేసింది. స్వాతంత్య్రం వచ్చాక వాటి సంగ తి చూసుకోవచ్చని చెప్పింది. కాని స్వాతంత్య్ర భారతంలో కూడా వాటిని సమగ్రదృష్టితో చేపట్టలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో క్రమంగా మృధు హిందూత్వను అనుసరించింది. ము స్లింల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం ప్రయత్నించకుండా సాంప్రదాయ శక్తులను సంతృప్తి పరిచే విధానాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ చేసిన హెచ్చరికను పెడ చెవిన బెట్టారు. తద్వారా ప్రభుత్వాలు మెలమెల్లగా రాజకీయ ప్రజాస్వామ్యానికీ ప్రమాదం తెచ్చి పెట్టాయి.
అక్కడో నల్లరాయి ఇక్కడో తెల్లరాయి పేర్చినట్లుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్ని సమర్పిస్తూ చెప్పా రు. రాజ్యాంగ రూపొందుతున్న సమయంలో సైద్దాంతికంగా అసమ్మతి తెల్పిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు పరిమితం కాకుండా సభ్యులు చర్చల్లో అనేక విషయాలను ముందుకు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఒక హెచ్చరిక చేశారు.
”జనవరి 26,1950తో మనం ఒక వైరుధ్య” భరితమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కాని సామాజిక అర్థిక రంగాల్లో అసమానత ఉం టుంది. రాజకీయాల్లో ఒకరికి ఒకే ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ అన్న సూత్రాన్ని అనుసరిస్తాం. కాని మన సామాజిక, ఆర్థిక నిర్మా ణం కారణంగా మనుషులందరికీ ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తాం. ఈ వైరుద్యాల మధ్య మనం ఎంతకాలం ఉండ గలం. సామాజిక, అర్థిక రంగాల్లో ఎంతకాలం సమానత్వాన్ని నిరాకరించగలం. చాలా కాలం పాటు ఈ నిరాకరణ సాగితే మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన వార వుతాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాన్ని తొలగించాలి. లేకపోతే మనం ఎంతో కష్టపడి రూపొందించుకొన్న రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణం పేలిపోతుంది.” అన్నారు అంబేద్కర్.
మోడీ పాలనలో బీజేపీ తన మతతత్వ విధానాలను బాహా టంగా అమలు చేయడానికి పూనుకొంది. రాజ్యాంగ సంస్థలను తన రాజకీయ ప్రయోజనాలను సాధించే పనిముట్లగా మార్చుకొంది. ఎన్నికల సంఘం, పోలీసు విభాగాలు వెన్నుముక లేని సంస్థలయ్యాయి. ఎలక్టొరల్ బాండ్లపేర అవినీతికి, అశ్రిత పెట్టుబడి దారులకు ప్రజల పొమ్మును ధారపోసే విధానాలను కాంగ్రెస్ కంటే నిస్సిగ్గుగా అమలు చేస్తోంది. తీవ్రమైన నేర చట్టాల కింద కేసులు బనాయించి ఏండ్ల తరబడి జైళ్లలో పెడు తోంది. ఆ కేసులు విచారణకు సైతం రావు. నిందితులు అలా జైళ్లలో ఉండిపోవాల్సి వస్తుంది. మీడియా స్వేచ్ఛను కొనేసింది. అడ్డగోలు వాదనలకు వార్తలకు సోషల్ మీడియాను పెంచి పోషి స్తోంది. పార్లమెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చింది. ప్రతి పక్షంలో ఉండగా చెప్పిన సుద్దులు ఒక్కటీ పాటించదు తనకు అవసరమైన బిల్లులను పేరుకే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి తగిన చర్చకు అవకాశమివ్వకుండా ఆమోదముద్ర వేసుకొంటుంది. రాష్ట్రాల్లోని గవర్నర్లు అధికారిక చొరబాటు దారుల్లా రాష్ట్ర ప్రభు త్వాలను ఇబ్బంది పెడుడున్నారు. మోడీకి, షాకు మాత్రమే మేము జవాబుదారీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు వాఖ్యలను తీర్పులను పట్టించుకోవడం లేదు. మెజారిటీ మత తత్వం నియంతృత్వం వైపునకు మైనారిటీ మతతత్వం టెర్రరిజం వైపు వెళ్తాయన్న అంచనాలను మోడీ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపెడుతోంది.
రాజ్యాంగసభలో ప్రొ.కె.టి.షా అనే సభ్యుడు రాజ్యాంగం లోని ఆర్టికల్1, క్లాజు1లో సెక్యులర్, ఫెడరల్, సోషలిస్టు అనే పదాలను చేర్చాలని ప్రతిపాదించారు. అంబేద్కర్ ఆ పదాల అవ సరం లేదని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో అవి భాగం గా రాజ్యాంగ ముసాయిదాల్లో భాగంగా ఉన్నాయని చెప్పారు. న్యాయ ప్రక్రియలో అనుసరించాల్సిన సోషలిస్టు సూత్రాలను, సమానత్వం నిష్పాక్షకత వంటి అంశాలను కూడా ఇదివరకే చేర్చా మని చెప్పారు. లౌకిక విలువకు అంబేద్కర్ గట్టిగా కట్టుబడి ఉన్నారు. న్యాయం- సమానత్వం గురించి బలంగా రాజ్యాంగ ముసాయిదాలో చెప్పామన్నారు. దేశ నిర్మాణం సందర్భంగా అను సరించాల్సిన సౌభ్రాతృత్వంపై ఆయన సభలో అనర్ఘళంగా మాట్లాడారు.
కాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లౌకిక విలువలు, సమానత్వం అన్నవి నచ్చని అంశాలు, అందుకనే పార్లమెంట్ నూతన భవనం ప్రాంరభంలో సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగ పుస్త కాల ప్రవేశికలో సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగిం చారు. ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాల ను చేర్చారు కనుక ఆ పదాలను తాము తొలగించినట్లు వివరణ ఇచ్చారు. కాని వాస్తవం ఏమిటంటే ఆచరణలో రాజ్యాంగ మూల స్వభావాన్నే బీజేపీ మార్చాలనుకొంటోంది. ప్రభుత్వాన్ని మతంతో కలగాపులం చేస్తోంది. మత సామరస్యం కోసం ప్రాణాలివ్వడా నికి సిద్ధపడిన మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను అనధికారికం గా ఆకాశానికి ఎత్తుతోంది. గాంధీ హత్యకేసులో సరైన సాక్ష్యాలు లేక బయటపడిన సావర్కర్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్టించింది.
భారత పౌరులు ఏ మతాన్నయినా అనుసరించవచ్చు, ఏ మతాన్నయినా స్వీకరించవచ్చు. అది ప్రాథమిక హక్కు. అందుకు విరుద్ధంగా బీజేపీి రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు తెచ్చారు. మతాంతర వివాహాలకు జిహాదు సాకు చూపి అడ్డుపడి ప్రాథమిక హక్కును హరించి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాతలు అశించిన అనుసరించదల్చుకొన్న మౌలిక విలువలు ఏమిటి? నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్న విలువలేమిటి? ఒకసారి బేరిజు వేసుకోవాల్సిన రోజు ఇది.
ఎస్. వినయకుమార్