చెక్ డ్యాముల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: ఆది శ్రీనివాస్

– వర్షాకాలం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి
– కోతకు గురైన చెరువులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
నవతెలంగాణ – వేములవాడ
జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో  ఆదివారం ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలకు మూలవాగు పై నిర్మించిన చెక్ డ్యాం ల దగ్గర వరదకు దెబ్బతిన్న పొలాలు భవిష్యత్తులో మళ్లీ వరద తాకిడికి ఇబ్బంది కాకుండా పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొనరావుపేట మండలం నిజామాబాద్,మామిడిపల్లి గ్రామల మధ్యలో నిర్మించిన చెక్ డ్యామ్ దగ్గర మరొకసారి వరద కోతకు గురికాకుండా కట్టల నిర్మాణం  చెక్ డ్యామ్ ఎత్తు తగ్గింపు గురించి విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు తెలిపారు. అదేవిధంగా వేములవాడ మండలం బొల్లారం,లింగంపల్లి మధ్య నిర్మించిన చెక్ డ్యాం,జయవరం దగ్గర నిర్మించిన చెక్ డ్యాం దగ్గర దెబ్బతిన్న పొలాలు మరియు కోతకు గురైన పొలాలు తిరిగి యధాస్థితి కి తీసుకురావడనికి గల అంచనాలు రూపొందించడానికి చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన చెక్ డ్యాములకు సంబంధించి, మరిమడ్ల,నిమ్మపల్లి, కొండాపూర్,వెంకటరావుపేట, మామిడిపల్లి పరిదిలోని నిర్మాణంలో చెక్ డ్యాం లు సంబంధించి భవిష్యత్తులో వరదలకు ఇబ్బంది కాకుండా నిర్మాణాలను చేపట్టాల్సిందిగా  సూచించారు. వేములవాడ పట్టణ పరిధిలోగల మల్లారం ఆనకట్ట నుండి గుడి చెరువుకు వచ్చే కట్టు కాలువ బుడగజంగాల కాలనీ వద్ద కాలనీ ముంపు గురవుతున్న విషయాన్ని ప్రస్తావించి కాలువలో గల పూడికతీయుట పై నుండి వచ్చే వరద మూలవాగులో వెళ్లి కలిసే విధంగా బుడగ జంగాల కాలనీ వద్ద నిర్మాణం చేపట్టాల్సిందిగా అన్నారు. పట్టణంలో గల మురికి కాలువలు గుడి చెరువులో కలవకుండా మూలవాగు వరకు కాలువలు నిర్మించుట కొరకు వేములవాడ మున్సిపల్ కమిషనర్ తో,కలిసి పరిశీలించి అంచనాల రూపొందించాల్సిందిగా అధికారులను తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో మద్య మానేరు నుండి అప్పర్ మానేరు వరకు నీరందించే ప్యాకేజీ-9 కి సంబంధించి పనుల పురోగతి తెలుసుకొని సింగసముద్రం చెరువు నుండి అప్పర్ మానేరు ప్రాజెక్టు వరకు గల బ్యాలెన్స్ పనులను,మలకపేట రిజర్వాయర్ యొక్క కుడి ఎడమ కాలువలు పూర్తి అవ్వడానికి కావలసిన నిధుల విడుదల గురించి ముఖ్యమంత్రి తో చర్చించడానికి కావాల్సిన నివేదికనలను పరిశీలించారు. బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తే తక్షణం 20 వేల నుండి 30 వేల ఎకరాల వరకు ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలోనే బాల్కొండ డివిజన్ పరిధిలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ తూముని,రెండు కిలోమీటర్ల కాలువని ఈ జిల్లా పరిధిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి అప్పగింత వల్ల నీటి యాజమాన్యం సులభంగా జరిగి ఎగువన ఉన్న బాల్కొండ నియోజకవర్గం లోని కోనాపూర్ గ్రామ ఆయకట్టుకి నీటిని అందించే బాధ్యతతో పాటు, వేములవాడ నియోజకవర్గం లోని భూషణ్రావుపేట్ ఊటపల్లి,చింతకుంట,కథలాపూర్ గ్రామల రైతులకి సాగునీరు అందించడం కోసం ఇంజనీర్ ఇన్ చీఫ్, నీటిపారుదల శాఖ, హైదరాబాద్ కి ఉత్తరం రాయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకి సూచించడం జరిగింది. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకి కథలాపూర్,మేడిపల్లి భీమారం మండలాలలో కోతకి గురి అయిన చెరువుల మరమ్మత్తులకి సంబంధించి వివిధ స్థాయిలో ఉన్న అంచనాలని త్వరితగతిన ఆమోదించి వచ్చే వర్షాకాలం లోపు చెరువుల మరమ్మత్తులను పూర్తిచేయాలని అధికారులని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ శివకుమార్,ఈఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఈఈ అమరేందర్ రెడ్డి, సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Spread the love