కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: సీపీఐ(ఎం)

Construction of a bridge over the canal should be undertaken: CPI(M)నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బస్వాపురం ప్రాజెక్టు నుండి ముత్తిరెడ్డిగూడెం రైతుల పొలాల మధ్యన నుండి వెళ్లిన కాలువ దాటి రైతులు, వృత్తిదారులు తమ పొలాల దగ్గరికి పోవడానికి తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, పల్లెర్ల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గురువారం సీపీఐ(ఎం) పోరుబాటలో భాగంగా భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెంలో ప్రజా సమస్యలను తెలుసుకున్న అనంతరం బస్వాపురం ప్రాజెక్టు నుండి ముత్తిరెడ్డిగూడెం మీదిగ వెళ్లే కాల్వ దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేయాలని రైతులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ, అంజయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం జరిగి, కాలువల ద్వారా నీరు వస్తే బీడుబడ్డ ఈ ప్రాంతమంతా సాగులోకి వచ్చి సస్యశ్యామలమవుతుందని, అందరికీ ఉపాధి దొరుకుతుందని అడ్డికి పావు షేర్ లెక్క లక్షల విలువ చేసే భూమిని కాల్వకు రైతులు భూములను ఇచ్చారని అన్నారు. కానీ భూమి తీసుకోని కాలువ తీసిన అధికారులు, రాజకీయ నాయకులు కాలువ అవతల ఉన్న భూముల దగ్గరికి రైతులు, వృత్తిదారులు ఏ విధంగా వెళ్తారనే సోయి లేకుండా కాలువను తవ్వారని విమర్శించారు. కాలువ అవతలి భాగంలో వందలాది ఎకరాల భూములు ఉన్నాయని, అనేకమంది పాడి రైతులు, గొర్ల కాపర్లు, మత్స్య కార్మికులు కాలువ అవతలి భాగంలో ఉన్నారని మరి వారందరూ ఎట్లా కాలువ దాటుతారని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతాంగము పోరాటం చేస్తే ఇదిగో బ్రిడ్జి అదిగో బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పి కాలువలో పైపులు వేసి మట్టి పోశారని అన్నారు. పైపులు వేస్తే పరిష్కారం కాదని దీర్ఘకాలికంగా ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకు ఉపయోగపడడానికి తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే పెద్ద ఎత్తున ప్రజలను రైతాంగాన్ని వృత్తిదారులను సమీకరించి ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని వాళ్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, సీపీఐ(ఎం) సభ్యులు, గ్రామ రైతులు గజ్జి ఐలయ్య, గజ్జి కుమార్, కూకుట్ల రమేష్ , కన్నెమోయిన నర్సింహ, గజ్జి లింగం, కూకుట్ల మంగమ్మ, దినేష్ లు పాల్గొన్నారు.
Spread the love