కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం

– మండలానికో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
– నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తాం
– ప్రతీ ఏడాది రెండు లక్షల మందికి శిక్షణ
– న్యాక్‌ చైర్మెన్‌, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని న్యాక్‌ చైర్మెన్‌, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పేపర్లలో ఫోటోలు, టీవిల్లో స్టేట్మెంట్లతో ఆర్భాటాలు చేసింది తప్పితే ఎక్కడా నిజాల్ని వెల్లడించలేదన్నారు. శుక్రవారం హైటెక్స్‌లోని న్యాక్‌లో జరిగిన 45వ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు మంత్రి పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, జిల్లాల్లో స్కిల్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయడం, న్యాక్‌ భూముల్ని కాపాడటం, నిరుద్యోగులకు ఉపాధికల్పనకు నిర్వహించాల్సిన కోర్సులపై విస్తతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి లక్షల మంది యువత జీవితాలతో ఆడుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రచారాలు ఎక్కువన్నారు. వారు చెప్పిన ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదన్నారు. దుబారుకు చెందిన నాఫ్కో కంపెనీ న్యాక్‌తో (ఎంఓయూ) ఒప్పందం చేసుకొని ఫైర్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ అకాడమీని ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నారని తీరా చూస్తే అసలు ఆ కంపెనీ ఊసేలేదని న్యాక్‌ సిబ్బంది చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రతీ సంవత్సరం కనీసం రెండు మూడుసార్లు జరపాల్సిన న్యాక్‌ గవర్నింగ్‌ బాడీ సమావేశాల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే జరిపారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, మండలాల వారిగా నిరుద్యోగులకి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాణ్యమైన ట్రైనింగ్‌ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులకు భరోసా కల్పించారు. న్యాక్‌కు సంబంధించిన భూముల్ని పొందిన కొన్ని సంస్థలు పూర్తిగా కమర్షియల్‌ కార్యకలపాలకు వినియోగిస్తూ న్యాక్‌ ఆదాయానికి పెద్దయెత్తున్న గండికొడుతున్నాయని వాటిని సరిచేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, న్యాక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కే.భిక్షపతి, డైరెక్టర్‌ శాంతి శ్రీతోపాటు ఇతర డైరెక్టర్లు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు
– అన్ని పూర్వ జిల్లా కేంద్రాల్లో స్కీల్‌ డెవప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు, వాటి ద్వారా నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఔ అందించాలని నిర్ణయం.
– నల్గొండ జిల్లాలో స్కీల్‌ డెవప్‌మెంట్‌ కేంద్రాల నిర్మాణానికి రూ.20కోట్లకు ప్రతిపాదన చేశారు.
– అన్ని జిల్లాలో న్యాక్‌ అభివృద్ధికి మరింత కృషి
– నెలుకు నాలుగైదు సార్లయినా న్యాక్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి ప్రతిపాదన చేశారు.
– హైదరాబాద్‌లోని న్యాక్‌ క్యాంపస్‌లో అంతర్జాతీయ నిర్మాణ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన
– మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో గిరిజన నైపుణ్యాభివృద్ధికి రూ.10కోట్ల ప్రతిపాదన
– ప్రతిపాదిత విశ్వవిద్యాలయంలో డిజిటల్‌ నిర్మాణం, ప్రీ క్యాస్ట్‌తో పాటు ఇతర ఆధునాతన సాంకేతికతో ప్రాజెక్టుల నిర్వహణపై న్యాక్‌లో సరికొత్త కోర్సులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు చేశారు.

Spread the love