ఎండ‌ల్లో కూల్ కూల్

Cool in the sunవేసవి వచ్చిందంటే మామిడి పండ్లు, సెలవులు, శుభకార్యాల హడావుడితో పాటు ఉక్కబోతనూ మోసుకు వస్తుంది. ఓ వైపు వేడి, చెమట, మరోవైపు ఉక్కబోత. వీటిని తట్టుకుని ఈ వేసవి నుండి బయటపడాలంటే శరీరం నీటిని కోల్పోకుండా కాపాడుకోవాలి. ఆహారంలో నీరు, పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చాలి. మసాలాలు, వేపుళ్లకు దూరం ఉండాలి. శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. తగినంత నీరు తాగటం కంటే వేసవి తాపాన్ని నివారించడంలో మరొక ఉపాయం లేదు.
మనిషి ప్రతిరోజూ శరీరం నుండి నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం సహజం. ఇది శరీరం నుండి చమట, మూత్రం రూపంలో బైటికి వెళ్తుంది. చెమటతోపాటు అధిక మోతాదులో శరీరంలోని లవణాలను కూడా కోల్పోతాం. ఆ లవణాలను తిరిగి పొందడానికి శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అవసరం. సమ్మర్‌లో చర్మం పొడిబారినట్లు, నల్లగా కమిలినట్లు అగుపిస్తుంటే డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుసుకోవాలి. అలాగే యూరిన్‌ కలర్‌ కూడా పరిశీలించాలి. యూరిన్‌ పసుపు లేదా ఎరుపు వర్ణంలో ఉంటే డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్లు గుర్తించాలి. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచితే శరీరంలోని విషతుల్య పదార్ధాలను తొలగించడంతో పాటు, మేలిమి ఛాయతో చర్మం మెరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తలనొప్పిని సైతం నిరోధిస్తుంది. అయితే, నీటిని నేరుగా తాగడానికి, కొంతమంది విముఖత ప్రదర్శిస్తుంటారు. చిన్నపిల్లల్లో ఈ స్వభావాన్ని గమనిస్తుంటాం కూడా. భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూసులు, శీతల పానీయాలు ఏ మేరకు మేలు చేస్తాయో చెప్పలేం కానీ సమ్మర్‌లో దొరికే తాటిముంజలు మాత్రం ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. తాటి ముంజల్లో ఉండే పోషకాలు వేసవి వేడిమి నుంచి ఉపశమనం కలిగించడతో పాటు పలు ఆనారోగ్య సమస్యలకు చక్కటి ఔషధంలా పని చేస్తాయి.
పండ్ల రసాలు పైకి ఆరోగ్యంగా కనిపించినా వాటిలో పోషకాల కంటే చక్కెరలే ఎక్కువ. మార్కెట్లలో దొరికే ప్యాకేజీ పండ్లరసాల్లో చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. అందుకే కత్రిమ పానీయాలు ఆరోగ్యానికి హానికరం. పండ్ల రసాల దుకాణాల్లో జ్యూస్‌లు తాగినా లాభం అంతంత మాత్రమే. జ్యూస్‌ తయారీ ప్రక్రియలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, లవణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. తాజాపండ్లు తింటే బరువు తగ్గుతారు. అదే పండ్లరసాలు తాగితే అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతారు.
నిర్జలీకరణం శరీర సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది. తద్వారా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. నిర్జలీకరణం రక్తపోటు సమతుల్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ మార్పు తలనొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యలన్నింటి నుండి బయట పడాలంటే నీరు ఎక్కువగా తాగాలి. లేదా నీటి శాతం ఎక్కువగా వుండే పండ్లు తినాలి. వేసవి సీజన్లో ఎక్కువ దప్పికతో శీతల పానీయాలు, కార్బోనేటేడ్‌ పానీయాలను ఆశ్రయిస్తారు. ఇవి చాలా అనారోగ్యం కలిగిస్తాయి.
వేసవిలో దాహం తీర్చే ఆరోగ్యకరమైన పానీయాల గురించి తెలుసుకోవాలి. ఇవి మీ శరీరంలో ద్రవాలను నింపటమే కాకుండా చెమట రూపంలో కోల్పోయిన వివిధ ఎలెక్ట్రోలైట్స్‌ను సరఫరా చేస్తాయి.
ఉప్పు, పంచదార కలిపిన నీళ్ళు శరీరంలో డీహైడ్రేషన్‌కి చక్కటి పరిష్కారం. ఆరంజ్‌, నిమ్మ పండ్లతో అద్భుతమైన రసాలను చేయవచ్చు. అన్ని రకాల పండ్ల మిశ్రమంతో కలబోత పండ్ల రసాన్ని తీసుకున్నా ఉపయోగమే. కొద్దిపాటి ఉప్పు, పంచదార ఆ పండ్ల రసాలలో కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది.
డాక్టర్లు చేసిన పరిశోధన ప్రకారం పండ్లరసాన్ని తీసుకోవడం కంటే పండ్లు నేరుగా తింటే అందం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శక్తితో పాటు శరీర బరువును అదుపులో వుంచుకోవచ్చు. వండిన పండ్లను తింటే పోషకాలు అస్సలు రావు. కేవలం దాని రుచిని మాత్రమే పొందుతారు. వంట విటమిన్లను నాశనం చేస్తుంది.
రసం తాగడం కంటే మొత్తం పండు తినడం మంచిది. అప్పుడే పండ్ల రసం నోటి లాలాజలంతో కలిసి ఆరోగ్యకరమైన ఎంజైములను విడుదలవుతుంది. తాజా పండ్ల రసాన్ని నెమ్మదిగా తాగాలి. పండ్లను 3 రోజుల కంటే ఎక్కువ నిల్వవుంచొద్దు.
సోడాలంటే చాలా మందికి ఇష్టం. కానీ బయట దొరికే సోడాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. అవి ఇష్టపడేవారు నిమ్మ-పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాసు నిమ్మ-పుదీనా జ్యూస్‌ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. అంతేకాకుండా దీనిలోని 40 గ్రా. సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి మేలు చేస్తాయి. గ్లాసులో కొంచెం నిమ్మరసం, దానిలో కొన్ని తాజా పుదీనా ఆకులు వేయండి. తీపి కోసం సిరప్‌ను రెండు టేబూల్‌ స్పూన్స్‌ కలుపుకోండి. ఇప్పుడు గ్లాసు నిండా చల్లని కార్బోనేటెడ్‌ వాటర్‌ (సోడా) పోయాలి. జ్యూస్‌ చల్లగా లేకపోతే కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్స్‌, ధూమపానం, కాలుష్యం కారణంగా సంభవించే స్వేచ్ఛా రాడికల్స్‌ బారి నుండి నష్టం జరగకుండా కాపాడుతాయి.
కత్రిమంగా తయారు చేసి రిఫ్రిజిరేటర్లలో పెట్టి అమ్మే జ్యూసుల గురించి మరిచిపోండి. ఎలక్ట్రోలైట్‌ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు తీసుకోండి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తరచుగా దాహం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పండ్ల రసాలు, కొబ్బరి నీరు, చెరుకురసం ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
చెరుకు రసం :
చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్‌ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో, కాలేయాన్ని (లివర్‌ స్ట్రాంగ్‌) బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందుకే చెరకు రసం కామెర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. చెరకులో సహజమైన సుక్రోజ్‌ శరీరానికి శక్తిని అందిస్తుంది. అధిక వేడితో అలసిపోయినా శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా.. చెరకు రసం ఉత్తమ ఎంపిక.
ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ :
ఎండలో బాగా కష్టపడేవారికి, ఎక్కువగా అలసటకు గురయ్యేవారికి ఇది మంచి ఔషధం. ఒక గ్లాసు ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. 162 మిల్లీ గ్రాముల సోడియం, 15.3 కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి అందుతాయి. అంతేకాదు ఇది జీరో కొలస్ట్రాల్‌ డ్రింక్‌.
అర గ్లాసు నీళ్లు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. వాటిని గ్లాసులో పోసుకుని, దానిలో రెండు టీస్పూన్ల తేనె, అరటీస్పూన్‌ ఉప్పు కలపండి. ఇప్పుడు మరో గ్లాసులో కొంచెం మంచి నీళ్లు తీసుకొని దానికి ఒక నారింజ పండు జ్యూస్‌, ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఈ పానీయాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి బాగా చల్లగా అయిన తరవాత సేవించండి.
ఇంట్లో రెండే రెండు నిమిషాల్లో తయారుచేసుకోగల ఈ దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మధ్య కత్రిమ దానిమ్మ జ్యూస్‌లు మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతున్నాయి. అయితే వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. దానిమ్మ పళ్లను కొనుగోలుచేసి ఇంట్లోనే జ్యూస్‌ తయారుచేసుకుని తాగితే ఉత్తమం. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో 75 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. గ్లాసు దానిమ్మ రసంలో 18.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, జీరో కొలస్ట్రాలు ఉంటాయి.
ఇష్టాన్ని బట్టి దానిమ్మ రసాన్ని మంచి నీటితోనూ, కార్బోనేటెడ్‌ వాటర్‌తో తయారుచేసుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలు మిక్సీలో వేసి, పిప్పి లేకుండా జ్యూస్‌ వడగట్టాలి. అందులో అరకప్పు కార్బోనేటెడ్‌ వాటర్‌/ మంచి నీటిని కలుపుకోవాలి. దీనికి కొంచెం నిమ్మరసం జతచేస్తే రుచి బాగుంటుంది. చల్లదనం కోసం కొన్ని ఐస్‌ క్యూబ్‌లు వేసుకుని తాగితే వేసవిలో హాయిగా అనిపిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్‌ :
పుచ్చకాయ 92 శాతం నీటితో తయారవుతుంది. డీహైడ్రేషన్‌ కాకుండా అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తినే పండు పుచ్చకాయ. దీంట్లోని లైకోపీన్‌, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, బి6, సి, పొటాషియం, అమైనో ఆమ్లాలు శరీరంలోని లవణాలు, పోషకాలు కోల్పోకుండా చేస్తాయి. ఈ జ్యూస్‌ను సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అయితే బయట రెగ్యులర్‌గా దొరికే పుచ్చకాయ జ్యూస్‌కు ‘వాటర్‌మిలన్‌ చిల్లర్‌’ కాస్త తేడా ఉంది. పుచ్చకాయ, దానిమ్మ, నిమ్మ కాంబినేషన్‌లో తయారుచేసే జ్యూస్‌ రుచిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి 87 కేలరీల శక్తిని అందజేస్తుంది. కొలస్ట్రాలు ఉండవు. గ్లాసు వాటర్‌మిలన్‌ చిల్లర్‌తో 22.1 గ్రాముల కార్బోహైడ్రేడ్స్‌, 1.1 గ్రాముల ప్రొటీన్‌ శరీరానికి అందుతుంది.
పుచ్చకాయ దంతాల ప్రకాశాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో మాంగనీస్‌, జింక్‌, పొటాషియం, ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్‌ ఉన్నాయి. ఇది దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దంతాల మీద రుద్దితే పసుపు పొర తొలగిపోతుంది. కానీ ఇది వేసవి కాలంలోనే లభిస్తుంది.
జ్యూస్‌ తయారు చేసి 20 నిమిషాల్లో తాగినప్పుడే వాటి పూర్తి ప్రయోజనాలు చేకూరతాయి. ఆలస్యం చేస్తే అందులోని పోషకాలు నశిస్తాయి. ఉదయం పూట మళ్లీ రాత్రి 7 నుండి 8 గంటల మధ్య జ్యూస్‌ తాగడం మంచిదని నిపుణుల సలహా. వ్యాయామం చేసిన అరగంట తర్వాత జ్యూస్‌ తాగితే శరీరానికి పోషకాలతో పాటు సహజ చక్కెర అందుతుంది. ఇలా సమయానికి ఫుడ్‌తో పాటు జ్యూస్‌లను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
పుదీనా లెమన్‌ వాటర్‌ :
రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పుదీనా లెమన్‌ వాటర్‌ చాలా మంచిది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సవాలుగా నిలిచే రుగ్మతలు దూరమవుతాయి. పుదీనా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల స్టోర్‌హౌస్‌.
పుదీనా లెమన్‌ వాటర్‌ ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి గొప్ప మార్గం. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో పుదీనా తినడం వల్ల అదనపు కొవ్వు, పొత్తికడుపు కొవ్వు తొలగిపోతుంది.
శరీరం నీటిని కోల్పోయి వడదెబ్బ తగిలినప్పుడు అధికంగా నీళ్లు, కొబ్బరి నీరు, గ్లూకోజ్‌, ఎలక్ట్రాల్‌, పల్చని మజ్జిగ, ఆమ్‌ పన్నా, నిమ్మరసం, లస్సీ, పళ్లరసం తాగాలి. ఇవి అందుబాటులో లేకుంటే ఒక గ్లాసు నీళ్లలో స్పూను చక్కెర, చిటికెడు ఉప్పు వేసి తాగించాలి. తక్షణం వైద్య సహాయం తీసుకోవడం అవసరం.
దోసకాయ, కస్తూరి పుచ్చకాయ పానీయం :
ఒక జ్యూసర్‌లో దోసకాయ, కస్తూరి పుచ్చకాయ ముక్కలు వేసి జ్యూస్‌ తీయాలి. దీనికి అర స్పూన్‌ తేనె, చిటికెడు ఉప్పు కలపాలి. కొంచెం జీలకర్ర తాజా పుదీనా ఆకులను కూడా కలపవచ్చు. ఈ పానీయం అధిక చెమటను నిరోధిస్తుంది.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

Spread the love