అవకతవకల మధ్య సాగుతున్న కౌంటింగ్..

– ఎమ్మెల్సీ కౌంటింగ్ లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆర్వో
– బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకునే కుట్ర
– కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తున్నట్లు ప్రకటిస్తున్న అధికారులు
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఎమ్మెల్సీ కౌంటింగ్ లో ఆర్వో పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ  పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఆర్వో దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై తాము ఆర్వో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కాంగ్రెస్ అభ్యర్థికి లీడు వస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్ లో ఆర్వో వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తమకు డేటా సక్రమంగా ఇవ్వడం లేదని సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. హాల్ నెంబర్  4 లో బి ఆర్ఎస్ 539 ఓట్ల మెజార్టీ ఉన్నా ఫలితాలలో అధికారులు గోల్ మాల్ చేశారని ఆరోపించారు. మూడో రౌండ్ కౌంటింగ్లో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని రాకేష్ రెడ్డి చెప్పారు. తమ గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై వస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్ల సంతకం లేకుండానే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా రిజల్ట్ ను ప్రకటిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి 18876 ఓట్ల లీడు ఉన్నట్లు ప్రకటించారని ఇందులో 1100 ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుల్లో కూడా పూర్తిగా అక్రమాలు జరిగే అవకాశం ఉందని భూపాల్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రీకౌంటింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Spread the love