తప్పులు లేకుండా ఓట్ల లెక్కింపు చేయాలి

– మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నేడు  నల్గొండ పట్టణం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాంలో నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును  సజావుగా, ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి అన్నారు. సోమవారం ఆయన కౌంటింగ్ ఎన్నికల  పరిశీలకులు ఉపేంద్ర కుమార్ తో కలిసి దుప్పలపల్లి గోదాంలో పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, అలాగే కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన వివరాలను రౌండ్ల వారిగా మీడియాకు, ప్రజలకు తెలిసే విధంగా ముఖ్యమైన ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు,అభ్యర్థులు, సిబ్బంది అలాగే కౌంటింగ్ హాల్ ఇంచార్జ్ లు  తదితరులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love