నవతెలంగాణ-హైదరాబాద్: ఉద్దరాజు బాపిరాజు మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సంతాపం తెలియజేశారు. వారితోపాటు కార్యదర్శివర్గ సభ్యులు ఎస్,వీరయ్య , సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నాయకులు డీజీ. నరసింహ రావు, సీపీఐ(ఎం) పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, సీపీఐ(ఎం) పార్టీ మండల నాయకులు ఆర్. శ్రీరాములు,బాల వెంకటేశ్వరరావు,నాగభూషణం, బి.ఎన్ సుదర్శన్, శ్రీమన్నారాయణ, శివప్రసాద్, వివిధ ప్రాంతాల నుండి సిపిఎం నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రద్ధాంజలి అర్పించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సీపీఐ(ఎం) పూర్వ రాష్ట్ర నాయకులు ఉద్దరాజు రామం, మాణిక్యాంబ మూడో కుమారుడు ఉద్దరాజు బాపిరాజు (80) మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరపున తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బాపిరాజు హైదరాబాద్ లో రక్షణ శాఖ ఉద్యోగిగా ట్రేడ్ యూనియన్ నాయకుడుగా పని చేశారని తెలిపారు. అభ్యుదయ, సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమ సమాచారం సేకరణలో విశేష కృషి చేశారని స్మరించుకున్నారు. పార్టీ నాయకులతో ఆప్యాయ పూర్వక సంబంధాలు కొనసాగించేవారనీ, ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు అని చెప్పారు. జీవితాంతం తల్లిదండ్రుల అభ్యుదయ వారసత్వాన్ని కొనసాగించారని అన్నారు. వారి మృతి వామపక్ష, అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటు అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.



