ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. దామరచర్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. గత వారం రోజుల నుండి అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ యొక్క సర్వే పారదర్శకంగా నిర్వహిస్తూ ఇల్లు లేని నిజమైన పెదాలను మాత్రమే లబ్ధిదారులు గా ఎంపిక చేయాలని కోరారు. అదేవిధంగా అసలు ఇళ్ల స్థలాలు లేని వారిని కూడా గుర్తించి, వారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని అన్నారు. నియోజవర్గానికి సుమారు పదివేల ఇల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులను మరోసారి దరఖాస్తు చేసుకునే విధంగా సౌలభ్యం కల్పించినప్పటికీ మండల స్థాయిలో ఇంతవరకు ఆన్లైన్లో నెట్వర్క్ పనిచేయకపోవడం ద్వారా అనేకమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కావున తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం వీటిపై చర్యలు తీసుకొని పేద ప్రజానీకానికి ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి వినోద్ నాయక్ , మండల కమిటీ సభ్యులు కోటిరెడ్డి , పాపా నాయక్ , దయానంద్ , కాజా మొహిద్దిన్, సుభాని, కాంతారావు ,విజయ్ ,మట్టా రెడ్డి, చంద్రకళ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.