సీపీఎస్‌ విధానం రద్దు చేయాలి

– ప్రతి పాఠశాలకు స్కావెంజర్‌ను నియమించాలి
– ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ – బోనకల్‌
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి పాఠశాలకు స్కావెంజర్‌ను నియమించాలని, ప్రమోషన్ల అనంతరం ఖాళీగా ఉన్న పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని జానకీపురం, రావినూతల, బోనకల్‌ ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో అలుగుబెల్లి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం కొంత పర్వాలేదన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ముగ్గురు ఉన్నారని, వారి పనితీరు ఎలా ఉందో ఉపాధ్యాయులు అంచనా వేసుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నిత్యం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయుల గొంతుకని వినిపిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దాని బలోపేతానికి ఉపాధ్యాయులతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాలని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, పాఠశాలలో ఖాళీలను భర్తీచేయాలని కోరారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వివిధ రకాల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నర్సిరెడ్డికి అందజేశారు. బోనకల్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులూ వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గాభవాని, జిల్లా నాయకులు రమాదేవి, జిల్లా కోశాధికారి వల్లకొండ రాంబాబు, నాయకులు సదాబాబు, ఎన్‌ వీరబాబు, బోనకల్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు భూపతి ప్రీతం, గుగులోతు రామకృష్ణ, బీసీ వెల్ఫేర్‌ రాష్ట్ర నాయకులు లెనిన్‌ స్టన్‌, శివకృష్ణ, మండల ఉపాధ్యక్షులు పి.గోపాలరావు, మండల కమిటీ సభ్యులు పి.నరసింహరావు, టి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love