– మారిన ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం
– గెలుపు అవకాశాలను దూరం చేసిన చెల్లని ఓట్లు ?
– పట్టభద్రుల అవగాహనా రాహిత్యం
నవతెలంగాణ-నల్లగొండటౌన్
వాళ్లంతా విద్యావంతులే.. డిగ్రీ, పీజీ చదివిన వారే. వారందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఓటు వేసే విషయంలో కొంతమంది ఫెయిలయ్యారు. అవగాహన లేక ఓటు వేయలేదా?.. కావాలని నిర్లక్ష్యంతో బ్యాలెట్‌పై పిచ్చిగీతలు గీశారా? అన్నది తెలియదు. కాని గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించ కపోవడంతో వారు వేసిన ఓట్లు చెల్లని ఓట్లుగా మిగిలిపోయాయి. ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు, ఎంతోమంది అనేక రకాలుగా అవగాహన కల్పించారు. గ్రాడ్యుయేట్లు ఓటు ఎలా వేయాలనే అంశంపై ఎన్నికల కమిషన్ అనేక అవగాహనా కార్యక్రమాలనూ చేపట్టింది. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. పోటీచేసిన అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ఇంత పెద్దఎత్తున ప్రచారం చేసినా నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏకంగా 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన అభ్యర్థులతో సమానంగా చెల్లని ఓట్లే ఐదో స్థానంలో ఉన్నాయి. పట్టభద్రులకు ఓటు వేయడంలో ఫెయిల్ కావడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థులు గెలుపు అవకాశాలకు దూరమయ్యారు.
గెలుపు అవకాశాలను దూరం చేసిన చెల్లని ఓట్లు
నియోజకవర్గంలో 4 లక్షలా 6 వేలా 300 మంది పట్టభద్రుల ఓట్లు ఉండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) 1,22,813 ఓట్లు, రాకేశ్ రెడ్డి(బీఆర్‌ఎస్) 1,04,248 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ) 43,313 ఓట్లు, అశోక్ కుమార్ (స్వతంత్ర) 29,697 ఓట్లు రాగా ఐదో స్థానంలో 25,877 చెల్లని ఓట్లు ఉన్నాయి. ప్రధాన అభ్యర్థులైన ప్రేమేందర్ రెడ్డి, అశోక్ కుమార్‌కు వచ్చిన ఓట్లతో సమానంగా చెల్లని ఓట్లు బయట పడటం ఎన్నికల అధికారులను విస్మయానికి గురిచేసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు వచ్చిన మెజారిటీ 18,565 ఓట్లు ఉండగా, అంతకంటే ఎక్కువ సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండడంతో ప్రధాన అభ్యర్థులకు మొదటి ప్రయారిటీ ఓట్ల ద్వారా విజయావకాశాలు దూరమయ్యాయి.
పట్టభద్రుల అవగాహనా రాహిత్యం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై పిచ్చి రాతలు ఉన్నాయి. చాలామంది పట్టభద్రులు బ్యాలెట్ పేపర్‌పై అంకెలు వేయాల్సింది పోయి.. ఐ గుర్తు పెట్టడం, క్రాస్ గుర్తులు, టిక్ మార్కులు పెట్టడం, జై కాంగ్రెస్, జై కేసీఆర్, ఎమ్మెల్సీలుగా ఈ అభ్యర్థులు పనికిరారంటూ రాయడం వంటివి ఉన్నాయి. కొందరైతే లవ్ గుర్తులు, బ్యాలెట్ పేపర్ వెనకాల ఫోన్ నంబర్లు వేయడంతో చెల్లుబాటు కాకుండా పోయాయి. మరికొందరైతే తమ సంతకాలు పెట్టారు. ఇలా చేయడం పట్ల అధికారులు, రాజకీయ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటు ప్రాధాన్యతను గుర్తించి సరిగా ఓటు వేస్తే సమయం కూడా కలిసి వచ్చేదని పలువురు ఎన్నికల సిబ్బంది అభిప్రాయపడ్డారు.