పాల బిల్లుల కోసం పాడి రైతుల ఆందోళన..

– జాతీయ రహదారిపై పాలు పోసి నిరసన తెల్పిన పాడి రైతులు
– కడ్తాల్ మిల్క్ సెంటర్ మేనేజర్ కు వినతి పత్రం అందజేత
– రెండు నెలలుగా బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన 
– వెంటనే పాడిరైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ 
నవతెలంగాణ – ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రములో శనివారం పెండింగ్ పాల బిల్లుల కోసం పాడి రైతులు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా పలువురు పాడి రైతులు మాట్లాడుతూ రెండు నెలలుగా బిల్లులు రాకపోవడంతో పాడి పరిశ్రమనే నమ్ముకొని జీవిస్తున్న పాడి రైతుల కుటుంబాలు వీధి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలతో వ్యవసాయ కార్యక్రమాలతో పాటు పాఠశాలలు ప్రారంభం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోయారు. ఆందోళనలో భాగంగా దాదాపు వంద లీటర్ల పాలను శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై పారబోసి‌ వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం పాడి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ స్థానిక మిల్క్ సెంటర్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు, పాడి రైతులు కడారి రామకృష్ణ, సుధాకర్, కృష్ణయ్య వెంకటేష్ జంగయ్య, మహేష్, చంద్రయ్య, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజు, రామచంద్రి ప్రశాంత్, అనిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love