ఫార్మాతో ప్రమాదకరం

ఫార్మాతో ప్రమాదకరం– బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మోసపూరిత మాటలు నమ్మొద్దు
– సీపీఐ(ఎం) మాజీ ఎంపీ పి.మధు
– ఇబ్రహీంపట్నం అభ్యర్థి యాదయ్య తరపున ప్రచారం
నవతెలంగాణ-యాచారం
ఫార్మా కంపెనీతో ఈ ప్రాంతంలో గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదముందని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పి.మధు అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య సోమవారం యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నంలో ప్రచారం నిర్వహించారు. యాచారం, మంచాల మండలాల్లో బైక్‌ ర్యాలీ తీశారు. యాచారం మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన సభల్లో పి.మధు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడాయని తెలిపారు. పదేండ్లలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి పేదల నడ్డి విరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకరమని చెప్పారు. ఫార్మా పేరుతో రైతుల భూములను గుంజుకున్నారన్నారు. ఫార్మా పేరుతో బీఆర్‌ఎస్‌ నాయకులు కోట్ల రూపాయలు దండుకున్నారని, ఆ డబ్బుతోనే ప్రజల ఓట్లను కొనాలని చూస్తున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కమ్యూనిస్టుల ఓట్లతో గెలిచి రియల్‌ ఎస్టేట్‌ పేరుతో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీతో ఈ ప్రాంత గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా బాధిత రైతులంతా ఎర్ర జెండాకు ఓట్లేసి అండగా నిలబడాలని కోరారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మాటలను నమ్మొద్దని సూచించారు. ఈ ప్రాంతంలో భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది పేద ప్రజలకు ఎర్రజెండా భూములను పంచిపెట్టిందని గుర్తు చేశారు. ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండా అభ్యర్థి పగడాల యాదయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.భూపాల్‌, స్కైలాబ్‌, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌, నాయకులు బి.మధుసూదన్‌రెడ్డి, ఆలంపల్లి నరసింహ, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love