స్ఫూర్తి ప్రధాత…దాశరథి

స్ఫూర్తి ప్రధాత...దాశరథిఓ నిజాం పిశాచమా కానరాడు, ఎవరు కాకతి, ఎవరు రుద్రమ అంటూ నిప్పులు చెరి గాడు. ఆ చల్లని సముద్ర గర్భం అంటూ పాట రాసి పీడిత ప్రజల పక్షాన నిల బడ్డాడు. వారి గొంతుకగా పోరు సాగించి తెలంగా ణకి కొత్త ఊపిరినందించాడు. కవి, రచయిత, తెలంగాణ విముక్తి కోసం శ్రమించిన యోధుడు. అతను ఒక వ్యక్తి కాదు శక్తి. అన్ని రంగాల్లో ఆరితేరిన కరడుగట్టిన తెలంగాణవాది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన ధీశాలి. ఆయనే మహాకవి దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణ నందించాడు. వరంగల్‌ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో 1925 జూలై 22న జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్‌ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్‌ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదిం చాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషిచేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.
హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం అరాచక పాలనలో హింసలను భరి స్తున్న తెలంగాణను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా నినదిం చాడు. దగాకోరు, బటాచోరు, రజాకారు, పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోరు, తెగిపోవోరు అంటూ నిజాం పాలన మీద బాణం ఎక్కుపెట్టాడు.ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వ హించి నిజాం ప్రభుత్వం చేత జైలుశిక్ష అనుభవించాడు. నిజామాబాద్‌లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది నిజాం ప్రభుత్వం. ఆయనతో పాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పండ్లు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. దాశరథి మంచి ఉపన్యాసకుడు కూడా. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మా తల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షు డుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెలుచుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్‌ ఉర్దూ గజల్‌లను తెలుగు లోకి గాలిబ్‌ గీతాలు పేర అనువదించాడు. తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. 1987 నవంబరు 5న దాశరథి మరణించాడు. బతికున్నపుడు ప్రజల్ని చైతన్య పరిచే ఎన్నో రచనలు చేశారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. నేటి తరం రచ యితలకు దాశరథి ఓ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మించిన మహబూబాబాద్‌ జిల్లాను దాశరథి జిల్లాగా నామకరణం చేయాలి. ఆయన గొప్పతనాన్ని నలుదిక్కులా చాటాలి. ప్రభుత్వం ఆయన జయంతి, వర్థంతిలను అధికారికంగా నిర్వహించాలి. అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.
( నేడు దాశరథి కష్ణమాచార్య వర్థంతి)
– కామిడి సతీష్‌రెడ్డి, 9848445134

Spread the love