దక్షిణ కొరియాలో దావానలం

South Korea– 24మంది మృతి, వెయ్యేళ్ళనాటి బౌద్ధ ఆలయం దగ్ధం
– కాలిబూడిదైన వేలాది హెక్టార్ల అటవీ ప్రాంతం
సియోల్‌ : దక్షిణ కొరియాలోని ఆగేయ ప్రాంతంలో పలు చోట్ల కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 24మంది మరణించగా, 20మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు వందలాది అగ్నిమాపక యంత్రాలు, వేలాదిమంది సిబ్బంది శ్రమిస్తున్నారు. గత వారాంతంలో 12చోట్లకు పైగా అడవులను అగ్ని కీలలు చుట్టుముట్టాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన 27వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరించారు. బుధవారం ఉదయానికి ఐదు చోట్ల మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. మిగిలిన చోట్ల పరిస్థితి కాస్త శాంతించిందని అధికారులు తెలిపారు. వేలాది ఎకరాల్లో చెలరేగిన మంటల కారణంగా వెయ్యేళ్ళనాటి చారిత్రక బుద్ధుని ఆలయనం దగ్ధమైంది. 681లో నిర్మించబడిన ఈ ఆలయంలో జాతి సంపద అంతా నిక్షిప్తమై వుంది. వాటిని ముందుగానే ఇతర ప్రాంతాలకు తరలించినట్లు మీడియా వార్తలు తెలిపాయి. యునెస్కో వారసత్వ జాబితాలో వున్న హహోయి గ్రామంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈ గ్రామానికి కేవలం 8కిలోమీటర్ల దూరంలోనే కార్చిచ్చు విస్తరిస్తోంది. మంటలు ఇతర కట్టడాలకు విస్తరించకుండే వుండేందుకు డజన్ల సంఖ్యలో నీటి ట్యాంకర్లు, అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. 200కిపైగా ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. మంటల నుండి తప్పించుకోవడానికి కారులో వెళుతుండగా, వాహనం బోల్తా పడడంతో నలుగురు రోడ్డుపై పడి మరణించారని కొరియా అధికార వార్తా సంస్థ బుధవారం తెలిపింది. ఇప్పటివరకు 17వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం తగలబడింది. గతంలోని అంచనాలను మించి ఈ విపత్తు చోటు చేసుకుందని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హన్‌ డక్‌ సూ వ్యాఖ్యానించారు. 5వేల మంది సైనికులు, 146 హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

Spread the love