విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం– ‘నీట్‌’తో అంతా బహిర్గతం
– ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎగ్జామ్‌’ విఫల ప్రయోగం
– ‘కేంద్రీకృత’ పరీక్షలు సరికావు
– మోడీ పాలనపై మేధావులు, నిపుణుల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో వైద్య కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్‌) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. పేపర్‌ లీక్‌లు, పరీక్ష వాయిదాలతో యూజీ, పీజీలలో అడ్మిషన్లు కోరే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ‘వన్‌ నేషన్‌, వన్‌ ఎగ్జామ్‌’గా తీసుకొచ్చిన ఈ నీట్‌ ఒక విఫల ప్రయోగమని మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) చీఫ్‌ను తొలగించటం, కమిటీని ఏర్పాటు చేయటం వంటివి కొంత వరకు జరిగినా విలువైన విద్యార్థుల సమయాన్ని మోడీ ప్రభుత్వం వృథా చేసిందని మేధావులు అంటున్నారు. ‘నీట్‌’ విషయంలో మోడీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నదని కాంగ్రెస్‌ వంటి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా కార్పొరేట్‌ మీడియా తన వంతు కృషి చేస్తున్నదని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయం నుంచి విద్య వరకు.. కేంద్రీకృతం చేయటానికి మోడీ సర్కారు భావిస్తున్నదనీ, భారత్‌ వంటి అతిపెద్ద విశాల దేశంలో ఈ విధానం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని నిపుణులు చెప్తున్నారు. నీట్‌-యూజీ, జేఈఈ, యూజీసీ-నెట్‌, సీయూఈటీ వంటి వాటితో సహా 15 ప్రధాన పరీక్షలు దేశంలో నిర్వహించ బడుతున్నాయి. ఆచరణాత్మకంగా దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించటానికి సంబంధించిన పనులన్నీ అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నిర్వహించబడతాయి. వారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రయివేటు సర్వీస్‌ ప్రొవైడర్లు తమ సిబ్బందితో పరీక్షలను నిర్వహించటం, ఐటీ సిస్టమ్‌లు, క్యూఆర్‌ కోడ్‌-సంబంధిత పని వంటి అన్ని సాంకేతిక పనులు ఔట్‌సోర్సింగ్‌ ద్వారానే జరుగుతాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలైన వీటికి ఔట్‌సోర్సింగ్‌ సహాయం తీసుకుంటే లీక్‌కు దారులు తెరిచినట్టేనని మేధావులు అంటున్నారు.
ఈ పరీక్షల బాధ్యతను ఎన్టీఏ చేపట్టక ముందు సీబీఎస్‌ఈ, ఏఐసీటీఈ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ పరీక్షలను నిర్వహించేవి. స్టేట్‌ సెలక్షన్‌ బోర్డ్‌ల వంటి వివిధ రాష్ట్ర స్థాయి పరీక్షల నిర్వహణలో, అలాగే రైల్వేలు, బ్యాంకుల వంటి రంగాల కోసం రిక్రూట్‌మెంట్‌లో కూడా ఔట్‌సోర్సింగ్‌ జరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు. నీట్‌ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఇప్పుడు కనిపిస్తున్న లోపాలు రాష్ట్రాలలో పదేపదే బయటపడ్డాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రచురించబడిన ఒక ఆంగ్ల వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. గత ఐదేండ్లలో 15 రాష్ట్రాల్లో కనీసం 48 పేపర్‌ లీక్‌ కేసులు కనుగొన బడ్డాయి. ఈ లీక్‌లు సుమారు 1.2 లక్షల పోస్టులకు కనీసం 1.4 కోట్ల మంది దరఖాస్తుదారుల జీవితాలను ప్రభావితం చేశాయి.
కేంద్రీకృత పరీక్షలు ఎందుకు?
మోడీ పాలనలో గత కొన్నేండ్లుగా ‘కేంద్రీకృత’ వ్యవస్థ అంశం ఎక్కువగా వినబడుతున్నది. పరీక్షల నిర్వహణకు కేంద్ర పరీక్షా ఏజెన్సీని కలిగి ఉండాలనే ఆలోచన కూడా మొదట 1990 ప్రారంభంలో సూచించబడిందన్నది విశ్లేషకులు చెప్తున్నారు. కానీ, మోడీ ప్రభుత్వం జాతీయవాద శక్తిపై ”ఒకే దేశం, ఒకటే ప్రతిదీ” అనే భావజాలాన్ని వ్యాపింప చేయాలనీ, దానిని ప్రజలపై బలంగా రుద్దాలని చూస్తున్నదని అంటున్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌, వన్‌ రేషన్‌ కార్డు, హెల్త్‌ కార్డు వంటివి ఇందులో భాగమని వారు చెప్తున్నారు. అన్ని ప్రాంతీయ ఆకాంక్షలు, వైవిధ్యాలకు భిన్నంగా ఇలాంటి కేంద్రీకృత వ్యవస్థలు దేశానికి ఏ మాత్రమూ శ్రేయస్కరం కావని మేధావులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎగ్జామ్‌ వంటివి విఫల ప్రయోగాలనీ, వీటితో మోడీ సర్కారు విద్యార్థులు, నిరుద్యోగులు, దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు.

Spread the love